రేపు వెండితెరను తాకనున్న సూపర్ స్టార్ రజనీకాంత్ “కబాలి” పూర్తి చిత్రం ఆన్ లైన్లో లీకైందో లేదో తెలియదు గానీ, ప్రారంభ దృశ్యం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విదేశాల్లో చిత్ర ప్రదర్శన కోసం ముందే ప్రింట్స్ పంపడం జరుగగా, అరబిక్ సబ్ టైటిల్స్ ఉన్న ఈ సీన్ లో కనిపిస్తుండటంతో, ఏదైనా గల్ఫ్ దేశంలో సినిమా సీన్స్ లీక్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
దాదాపు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ లో రజనీకాంత్ జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలున్నాయి. నీలి రంగు దుస్తుల్లో ఉన్న రజనీకాంత్, జైలు నుంచి బయటకు వస్తూ తన దుస్తులు, షూస్ తదితరాలు తీసుకోవడం, సహచరుల చేతులను ప్రేమగా తాకుతూ నడవటం వంటి దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇది రజనీ ఇంట్రడక్షన్ సీన్ గా భావిస్తున్న అభిమానులు తినే ముందు రుచి చూస్తున్నట్టుందని సంబరపడుతున్నారు.
ఈ సీన్ లోని ఓ డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలైన వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితరాల్లో శరవేగంగా దూసుకెళుతోంది. జైలు నుంచి బయటకు వచ్చే రజనీ పక్కనే నడుస్తున్న ఓ పోలీసు అధికారి చెబుతున్న డైలాగులివి. బ్యాక్ గ్రౌండ్ లో నీలి రంగు దుస్తుల్లో ఉన్న ఖైదీలు వరుసగా నడుస్తూ ఉండగా, వైట్ షర్ట్, బ్లాక్ కోట్ డ్రస్ తో రజనీనీ బయటకు తెస్తున్న పోలీసు అధికారి…
“ఇక్కడే ఉండి మరణించకుండా బయటకు వెళుతున్నావంటే అదృష్టవంతుడివి. ఈ మధ్యే 40 మంది ఎన్ కౌంటర్ లో పోయారు. అందులో 30 మంది తమిళులే. ఇక్కడి నుంచి వెళ్లే నువ్వు ఇక విలన్ వే” అని అంటాడు. అంతకుముందు, జైల్లోని మరో ఖైదీ “రెండే నెలలన్నా… నేనూ బయటకు వస్తాను… నీ కోసం నా తలే ఇస్తాను… నేనూ బయటకు వస్తాను…” అని జైల్లో తోటి ఖైదీ రజనీతో చెబుతున్న డైలాగు కూడా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాను ‘కబాలి’ దున్నేస్తోంది.



