మెగా తనయుడు రామ్ చరణ్ గుర్రపు స్వారీలో ప్రసిద్ధ అన్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెర్రీ నటనపై విమర్శలు వచ్చాయేమో గానీ, హార్స్ రైడింగ్ పై మాత్రం ప్రశంసలే లభించాయి. ముఖ్యంగా ‘మగధీర’ సినిమాలో చేసిన గుర్రపు స్వారీ మెగా అభిమానులను విపరీతంగా అలరించిన విషయం తెలిసిందే. అంతేకాదు, సెంటిమెంటల్ గా కూడా ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. దీంతో మెగా అభిమానులు చెర్రీ చేసిన గుర్రపు స్వారీని బాగా ఎంజాయ్ చేసారు.
అదే సెంటిమెంట్ తో ‘తుఫాన్’ సినిమాలో కూడా రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేసాడు. చెర్రీ కలగా చూపించే ఈ సన్నివేశాలు ఎలా ఉన్నా, ఈ సినిమా ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ దారుణ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో ఓ పాటలో మరియు ‘బ్రూస్ లీ’ సినిమాలో ఓ సీన్ లో తండ్రి చిరంజీవితో కలిసి హార్స్ రైడింగ్ చేసాడు చెర్రీ. ‘తుఫాన్’ మాదిరే ఈ సినిమాల ఫలితాలలో కూడా పెద్దగా మార్పు లేకపోయింది.
అయితే పట్టువదలని విక్రమార్కుడులా కనపడుతున్న చెర్రీ, తన తాజా సినిమా ‘ధృవ’లో కూడా హార్స్ రైడింగ్ చేయబోతున్నాడన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ముగిసిన కాశ్మీర్ షెడ్యూల్ లో ఓ పిల్ల వాడిని గుర్రం ఎక్కిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ గుర్రపు స్వారీ ఉండబోతుందని ఈ ఫోటోలు ధృవీకరిస్తున్నాయి. బహుశా ఈ పిల్ల వాడిని కాపాడేందుకో లేక రకుల్ తో సాంగ్ చిత్రీకరణ కోసమో గుర్రపు స్వారీ చేసేసి ఉంటారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు.



