వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఇవి ఎలక్షన్లో, సెలక్షన్లో తెలియడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి భావి తరాలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు.
పారదర్శకంగా ఎన్నికలు జరిపితే కూటమి అడ్రస్ లేకుండా పోతుందనే భయంతోనే ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే కూటమి ప్రభుత్వం హైజాక్ చేసింది,” అంటూ విమర్శలు గుప్పించారు.
ఇవి ఎన్నికలే కావని వాదిస్తున్నప్పుడు మరి వీటిలో వైసీపీ అభ్యర్ధులు ఎందుకు పోటీ చేస్తునట్లు? పోలింగ్ బూత్‌ల వద్ద పెట్రోల్ బాంబులు ఎందుకు విసురుతున్నారు? బ్యాలెట్ బాక్స్ ఎందుకు ఎత్తుకు వస్తున్నారు? అని ఆయననే ప్రశ్నించాల్సి వస్తుంది.
ఈ స్థానిక ఎన్నికల్లోనే కూటమి పార్టీలతో పోటీ పడలేక, ఈవిధంగా నిందిస్తూ ఓటమికి ఇలాంటి సాకులు చూపుతున్నప్పుడు, 2029 ఎన్నికల్లో కూడా ఇదే ప్రభుత్వం, ఇదే పోలీసులు, ఇదే ఎన్నికల సంఘం ఉంటుంది. మరి అప్పుడు వైసీపీ ఏవిధంగా గెలవగలదు? మరి ‘జగన్ 2.0’ ఎలా సాధ్యం? ఆ ఎన్నికల కోసం వైసీపీ వద్ద బలమైన ప్లాన్ ఏమైనా ఉందా? అనే సందేహం కలుగుతుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవిధంగా జరిగాయో అందరి కంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకే బాగా తెలుసు. అప్పుడు వైసీపీ చాలా భారీ మెజార్టీతో అధికారంలో ఉంది కూడా. కనుక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ఉండి ఉంటే భావి తరాలకు ఆదర్శంగా ఉండేవారు కదా?
భావి తరాలు ఈ ఎన్నికలను గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ అమరావతి, రాజధాని రైతుల విషయంలో ఆయన వైఖరిని తప్పకుండా గుర్తు చేసుకుంటారు. ఒకవేళ భావి తరాలు పట్టించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో తప్పకుండా జగన్ పేరు ఎర్రసిరాతో అండర్ లైన్ చేయబడి ఉంటుంది.
2019 శాసనసభ ఎన్నికల ప్రచారంలో “ప్రతీ ఇంట్లో నా తండ్రి వైఎస్సార్ ఫోటో పక్కనే నా ఫోటో కూడా ఉండాలని, ప్రజల హృదయాలలో శాస్వితంగా స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నానని,” జగన్ పదేపదే చెప్పేవారు.
కానీ ఇప్పుడు మళ్ళీ వస్తే ‘రప్పా రప్పా నరికేస్తాం. అధికారుల గుడ్డలు ఊడదీస్తాం,” అంటూ బెదిరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ ప్రజల హృదయాలలో స్థానాలు సంపాదించుకోవడం సాధ్యమేనా? అని జగన్ ఒక్కసారి ఆలోచిస్తేనే వైసీపీ దశదిశ మారుతుంది. లేకుంటే ఎప్పటికీ ఇలాగే కాలక్షేపం చేయక తప్పదు.




