గతవారం రోజులుగా సోషల్ మీడియా మొత్తం రవిబాబు ఇంటర్వ్యూలు, పాడు క్యాస్ట్ లతో నిండిపోయాయి. 100 ఏళ్ల తెలుగు సినిమా స్థితిగతుల నుండి, సినిమా మేకింగ్ స్టైల్, హీరోల ఆటిట్యూడ్, నిర్మాతల పైత్యం, కొంతమంది దర్శకుల పనితనం గురించి ఇలా సినిమాకి సంబంధించిన అన్ని టాపిక్స్ ని కవర్ చేసేశాడు రవిబాబు.
ఈ టాపిక్స్ మొత్తంలో రవిబాబు హీరో ఆటిట్యూడ్ గురించి మాట్లాడింది అల్లు అర్జున్ గురించే అనేది బాగా వైరల్ అయ్యింది. దానికి మళ్లీ రవిబాబు క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు అనుకోండి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పుకొచ్చాడు రవిబాబు. మాయాబజార్ సాంగ్ కాపీ విషయం చాలామందికి తెలియదు.
అయితే.. ఇంత మాట్లాడిన రవిబాబు “రేజర్” సినిమా రేపు (మే 08) విడుదలవుతుందన్న విషయం ఎంత మందికి తెలుసు? అనేది చర్చనీయాంశం. నిజానికి “అవును” తర్వాత రవిబాబుకు సరైన హిట్ లేదు. “క్రష్” లాంటి సినిమాతో కొన్ని నెలలు వైరల్ అయ్యాడు తప్పితే.. ఒక ఫిలిం మేకర్ గా రెస్పెక్ట్ మాత్రం పొందలేకపోయాడు.
నిజానికి “అల్లరి, సోగ్గాడు, అనసూయ, నచ్చావులే, అమరావతి, నువ్విలా” లాంటి సినిమాలతో టాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ కి ఒక బెంచ్ మార్క్ లా నిలిచాడు రవిబాబు. “సోగ్గాడు” సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమాలోని కామెడీ, పాటల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఇక “అనసూయ” అయితే తెలుగు సినిమా చరిత్రలోనే బెంచ్ మార్క్ థ్రిల్లర్. ఆ స్థాయి ఎంగేజింగ్ థ్రిల్లర్ తెలుగులో మళ్లీ రాలేదు అంటే అతిశయోక్తి కాదు.
అటువంటి రవిబాబు నటించి, దర్శకత్వం వహించిన “రేజర్” సినిమా రేపు రిలీజ్ అవుతుంటే హైదరాబాద్లో పట్టుమని 50 టికెట్లు కూడా తెగలేదు. ఒక ఫిలిం మేకర్స్ గా రవిబాబు తన మునుపటి సినిమాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకోవడమే ఇందుకు కారణం. సో, రవిబాబు నిన్నటివరకు ఇంటర్వ్యూలు, పాడు క్యాస్టులతో చేసిన హడావుడికి రేపు సినిమా చూశాక జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామనుకుంటే.. కనీసం బుకింగ్స్ కే దిక్కు లేదు. రేపు రిలీజ్ అయ్యాక వచ్చే రివ్యూలు, మౌత్ టాక్ బట్టే సినిమా సోమవారం దాకా అయినా ఆడుతుందా, లేక ఆదివారానికే సర్దేసుకుంటుందా? అనేది తెలుస్తుంది.




