కళ్యాణ్ రామ్ తో తీసిన ‘పటాస్’ సినిమా విడుదలైన తర్వాత… కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువగా పాపులర్ అయ్యింది ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ‘ఒక రొటీన్ కధను ఇంత వెరైటీగా ఎలా తీసారు?’ అంటూ ట్రేడ్ వర్గాలు ముక్కున వేలేసుకోగా, ‘భలే తీసాడంటూ’ బ్రహ్మరధం పట్టడం ప్రేక్షకుల వంతయ్యింది. ఇటీవల అంతా ‘వన్ మూవీ వండర్స్’గా నిలిచిపోతున్న తరుణంలో… అనిల్ రావిపూడి పరిస్థితి ఏంటో అనుకుంటుండగా వచ్చిన “సుప్రీం” కూడా మొదటి సినిమాను అనుకరించి రెండవ సక్సెస్ ను తన ఖాతాలో వేసింది.
దీంతో అనిల్ ‘వన్ మూవీ వండర్’ కాదు, ‘వండర్ ఫుల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్’ అన్న నమ్మకం ప్రేక్షకులలో కలుగగా, తాజాగా విడుదలైన రవితేజ “రాజా ది గ్రేట్” సినిమా టీజర్ దానిని మరింతగా బలపరిచింది. ఫస్ట్ లుక్ లోనే అందరినీ అనిల్ పడేసాడు అని చెప్పడంలో సందేహం లేదు. ‘మాస్ మాహారాజా’కు మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా ఈ టీజర్ ప్రశంసలను అందుకుంటోంది. ఇది కూడా పక్కా కమర్షియల్ మూవీ అన్న సంకేతాలు టీజర్ ఇచ్చేసినా, హీరో క్యారెక్టర్ ‘గుడ్డి వాడు’ కావడంతో అందరి ఆసక్తిని పొందగలిగింది.
చూడబోతుంటే… ఈ సినిమాతో అనిల్ రావిపూడి స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కమర్షియల్ సినిమాలను వినూత్నంగా తెరకెక్కించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అనిల్ మాత్రం అందులో సిద్ధహస్తుడిలా కనపడుతున్నాడు. దీంతో టాలీవుడ్ లో క్రేజ్ ఏర్పరచుకునే దర్శకులలో అనిల్ పేరు ముందువరుసలో ఉండే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి దిల్ రాజు ఇప్పటికీ అన్ని హంగులు పూర్తి చేసుకున్నారని వినికిడి.


