
తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్‌కు కొండంత అండగా ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీష్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరూ మంచి వక్తలే. విషయ పరిజ్ఞానం ఉన్నవారే. సమర్ధులు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవారే. ముఖ్యంగా ప్రజలతో మంచి అనుబందం ఉన్నవారే.
కనుక నలుగురు రాష్ట్రమంతా కలియతిరుగుతూ కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. వీరుకాక కేసీఆర్ శిక్షణలో రాటుతేలిన బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు. కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీలో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేస్తున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు, జనసేనలతో చాలా ధైర్యంగా పోరాడగలుగుతున్నారు.
ఇది చూస్తున్నప్పుడు, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వెనుక ఎవరెవరున్నారు?అని ఆలోచిస్తే మొట్టమొదట విజయమ్మ, షర్మిల కళ్ళ ముందు మెదులుతారు. కానీ వారిద్దరినీ జగన్ స్వయంగా పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి బయటకు సాగనంపేశారు. ఇక బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో పైకి పంపేశారు. తమ్ముడు అవినాష్ రెడ్డి అదే కేసులో బిజీగా ఉన్నారు.
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ బంధుగణమే. కానీ వారిలో వారు కీచులాడుకొంటున్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ రెడ్డి మేనమామ అవుతారు. కానీ ఆయన పరిధి కడప జిల్లా వరకే పరిమితం.
కనుక జగన్ బంధు గణం అంతా ఆయన వలన లబ్ధి పొందుతున్నవారే తప్ప వారిలో ఎవరి వలన జగన్‌కు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పొచ్చు. వారిలో ఎవరూ కూడా తమ జిల్లా, నియోజకవర్గం దాటితే ప్రజలతో పరిచయాలు లేవు. కనుక ఎవరినీ ప్రభావితం చేయలేరు.
కనుక వైసీపిలో జగన్ బంధుగణం కంటే విజయ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిని, మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్ముకోక తప్పడం లేదు. వారిలో విజయసాయి రెడ్డి కాస్తో కూస్తో జగన్‌కు తోడ్పడుతుననరు కానీ సజ్జల మాత్రం జగన్‌కు శల్యసారధ్యం చేస్తున్నారని వైసీపి నేతలే గుసగుసలాడుకొంటారు.
ఇక మంత్రులను నమ్ముకొంటే వారిలో చాలా మందికి తమ శాఖల గురించి అవగాహన లేదు. మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మాజీలు కొడాలి నాని, అనిల్ కుమార్ తదితరులు మీడియా ముందుకు వస్తే ఏమి మాట్లాడుతుంటారో అందరికీ తెలుసు.
వారిలో చాలా మందికి విషయ పరిజ్ఞానం లేకపోవడం మరో ప్రధాన సమస్య. కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేస్తూ మాట్లాడటం ద్వారా ఆ లోపాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు.
అదే… తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి, జిల్లా, నియోజకవర్గంలో జరుగుతున్న పనుల గురించి సాధికారంగా మాట్లాడుతుంటారు. ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు వైసీపి నేతల్లాగా ఏదో లేకిగా మాట్లాడటం కాకుండా, రాజకీయంగా సునిశిత విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్ శిక్షణకు, జగన్ శిక్షణకు చాలా తేడా ఉందని ఇది నిరూపిస్తోంది. ఇంతకీ జగన్ వెంట కుటుంబ సభ్యులు ఎవరున్నారు?విషయ పరిజ్ఞానం కలిగి సాధికారంగా మాట్లాడగలిగే వారు ఎందరున్నారు? రాష్ట్ర ప్రజలందరినీ ప్రభావితం చేయగలవారు ఎందరున్నారు?అని లెక్క చూసుకొంటే మంచిదేమో? ఆ తర్వాత 175 గురించి ఆలోచించవచ్చు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…