రాజకీయాలలో రాజీనామాలు రాజీలేగా..

రాజకీయాలు అనేది నిలకడతనం లేని ఒక రాజీ వ్యవస్థ అని చెప్పొచ్చు. ఈ రోజు మెడ మీద ఉన్న గులాబీ కండువా రేపటి రోజున కషాయంగా మారొచ్చు. అలాగే నేడు కమలం గుర్తు మీద గెలిచిన నాయకుడు రేపు హస్తం గూటికి చేరొచ్చు.

పార్టీ కండువాలు మార్చినంత ఈజీ గా రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద రాజీనామ సవాళ్లు చేస్తూ ప్రతి సవాళ్ళను బేఖాతరు చేస్తారు. కానీ ఆ ప్రతి సవాల్ చివరికి రాజీ తో సరిపెట్టుకుని రాజకీయ కాలగర్భంలో కలిసిపోవడమే తప్ప ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగలేదు.

ADVERTISEMENT

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, బాబు బూటులు తుడుస్తా అంటూ నాడు రాష్ట్ర వ్యాప్తంగా తొడలు కొట్టి, ప్రతిజ్ఞలు చేసిన కొడాలి నాని నేడు కనీసం తన సొంత నియోజకవర్గమైన గుడివాడలో సైతం అడుగు పెట్టలేకున్నారు.

అలాగే కొడాలి రాజకీయ సన్యాసం సవాల్ ఇప్పుడు రాజీతో సరిపెట్టుకుంది. ఇక ఇదే బాటలో అనిల్ కుమార్ యాదవ్ తొడలు కొట్టి, మీసాలు మెలేసి చివరికి తన సవాల్ కు ఎవరు ప్రతి స్పందించలేదు కాబట్టే నేను ఇంకా రాజకీయాలలో కొనసాగుతున్నా అంటూ కవరింగ్ కబుర్లు చెప్తూ కాలం వెళ్లతీస్తున్నారు.

ఏపీలో రాజీనామాల రాజీలు ఇలా ఉంటే ఇక తెలంగాణలో బస్తీమే సవాల్ అంటూ అధికార కాంగ్రెస్ పై కయ్యానికి కాలు దువ్వుతారు బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు. జాతీయ స్థాయిలో రాహుల్ మొదలు పెట్టిన ఓట్ చోరీ వివాదం నేడు తెలంగాణలో రాజీనామాల సవాళ్ల వరకు వెళ్ళింది.

తెలంగాణలో బండి సంజయ్ భారీ మెజారిటీ వెనుక ఓట్ చోరీ ఉందంటూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించిన విమర్శలకు గాను బీజేపీ నేతలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. బండి మెజారిటీ లో ఓట్ చోరీ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఓట్ చోరీ లేదా.?

నిజంగా ఓట్ చోరీ జరిగి ఉందని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాజీనామ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లగలరా.? బీజేపీ నేతల గెలుపుతో ఓట్ చోరీ ఉంటే రాష్ట్రంలో బీజేపీ కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.? అంటూ బీజేపీ నేతలు మహేష్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు అందరి పై ఒకపక్క ప్రశ్నల విమర్శలు కురిపిస్తూనే మరోపక్క రాజీనామ సవాల్ విసిరారు.

అలాగే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోణలకు కట్టుబడి కాంగ్రెస్ నాయకులంతా రాజీనామ చెయ్యాలని అలాగే బీజేపీ కూడా తన అభ్యర్థులను బరిలోకి దింపుతుందంటూ రాజీనామాకు నేను సిద్ధం మీరు సిద్ధమా.? అంటూ బండి సంజయ్ కాంగ్రెస్ కు రాజీనామ సవాల్ విసిరారు.

అయితే ఇటువంటి సవాళ్ళను స్వీకరించే సాహసం ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయడు, చేయలేడు. ఇవి కేవలం వారి పార్టీల రాజకీయ క్రీడలో భాగమే తప్ప ఈ సవాళ్లు రాజీ అనే లక్ష్మణ రేఖ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు సాగవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anil Ravipudi Says Festivals Don’t Matter, Then Why Sankranthi Again?

Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…

4 minutes ago

‘ఎపిక్’ సినిమా రివ్యూ: అర్థం లేని ప్రేమకథ!

చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…

17 minutes ago