
Revanth Reddy Questions BRS Over Krishna Water Sharing
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు నదీ జలాల పేరుతో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని నిత్యం విమర్శిస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఇంతకాలం మౌనం వహించిన సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా వారి ద్వంద్వ వైఖరిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు.
నాడు అంటే 2004-06 మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారిలో కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్నవారు, శాసనసభ్యులు ఆ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గతం గతః అనుకుని అప్పటి విషయాలు వదిలేసినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళ వాటాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయాలు జరిగాయి.
నాడు అంటే 2015 జూన్ 26న అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో కేసీఆర్, హరీశ్ రావు 512 టీఎంసీల నీటిని ఏపీకి, 298.96 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత మళ్ళీ 2020లో శాశ్వత ప్రాతిపదికన ఈ కేటాయింపులకు వారు అంగీకారం తెలిపిన మాట వాస్తవమా కాదా? చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2022 ఫిబ్రవరి 16న ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం జీవో నంబర్ 56 జారీ చేసింది. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు అభ్యంతరాలు తెలిపి అడ్డుకుని ఉంటే నేడు ఈ దశకు చేరేది కాదు కదా? అప్పుడు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పకుండా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కనుక ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వినియోగానికి సంబంధించిన నిర్ణయాలన్నీ ఒక్కరోజులో పుట్టుకొచ్చినవి కావని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన చర్చలు, ఒప్పందాలు, అనుమతులు, జీవోల ఆధారంగానే ఏపీ ప్రభుత్వం వాటి నిర్మాణాలు చేపడుతోందని స్పష్టమవుతోంది.
అప్పుడు అన్నిటికీ తల ఊపిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారగానే తెలంగాణ నీళ్ళను ఆంధ్రా ప్రభుత్వం దోచుకుంటోందంటూ సీఎం చంద్రబాబు నాయుడిని నిత్యం నిందిస్తూనే ఉన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు లేదా ఏపీ మంత్రులు ఏనాడూ వారిని తప్పుపట్టలేదు. అభ్యంతరం చెప్పలేదు. ఆ ధైర్యంతోనే బీఆర్ఎస్ నేతలు ఇంకా రెచ్చిపోతున్నట్లున్నారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఈ నీళ్ళ రాజకీయాలతో తమ సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, తాము రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందాలను వాటి తేదీలతో సహా బయటపెట్టిన ఈ విషయాలపై హరీశ్ రావు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Telugu cinema has been particularly leaning towards the sequels culture in the recent past. The…
Jr NTR's upcoming film with Prashanth Neel has an interesting Bollywood connection that many might…