
ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడానికి తపస్సు చేసిన్నట్లుగా ఎంతగానో శ్రమిస్తుంది. ఒక్కోసారి జీవితకాలం వాటి తపస్సు ఫలించకపోవచ్చు. ఆ తపస్సు ఎంత కటోరంగా ఉంటుందో ఎన్నికలలో ఓడిపోయాకనే ప్రతీపార్టీకి తెలిసివస్తుంది.
ఏపీలో జగన్, చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఈ కష్టం ఏమిటో బాగా తెలుసు.
కనుక అధికారంలో ఉన్నప్పుడు ‘మనకు కేవలం 5 ఏళ్ళు మాత్రమే గడువు’ అనే స్పృహ కలిగి ఉండటం, దానిని సద్వినియోగపరుచుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడం చాలా చాలా అవసరం.
కానీ ఈ స్పృహ కోల్పోయి మేము భగవంతుని స్వరూపాలమని భావిస్తూ అహంకారంతో విర్రవీగితే ఏమవుతుందో జగన్, కేసీఆర్‌ల పరిస్థితి చూస్తే అర్దమవుతుంది.
కేసీఆర్, జగన్‌ల పరిస్థితి కళ్ళారా చూస్తున్నా కూడా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తమ గడువుని, గమ్యాన్ని మరిచి రాజకీయాలతో కాలక్షేపం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈరోజు రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అందరూ కలిసి హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేసి ప్రస్తుతం రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నారు. దేనికంటే.. అదానీ ఆర్ధిక అవకతవకలపై విచారణ జరిపించాలట! మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం తీరుని నిరసించడానికట!
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఏడాది ముగిసిపోయింది. చివరి ఏడాదిలో ఎన్నికలకు సన్నాహాలు, టికెట్స్ పంపకాలు, వీటన్నిటి కోసం వారానికి రెండుసార్లు ఢిల్లీ పర్యటనలకు సరిపోతుంది. చివరి మూడు నెలలు ఎన్నికల ప్రచారానికే సరిపోతుంది.
కనుక రేవంత్ రెడ్డి వద్ద కేవలం 3 ఏళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. అమూల్యమైన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తూ ప్రజలను మెప్పించే ప్రయత్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి కూడా ఈవిదంగా రాజకీయ కాలక్షేపం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ హయంలోనే తెలంగాణ ఏర్పడినప్పటికీ పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎంతగానో శ్రమించి అధికారంలోకి తీసుకువచ్చారు. కనుక ఆ కష్టం ఏమిటో అందరి కంటే ఆయనకే బాగా తెలుసు. కానీ ఆయన కూడా ఆగమ్యగోచరంగా ముందుకు సాగిపోతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేసీఆర్ నిరంకుశత్వం, అవినీతి, కుటుంబపాలన ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరం అభివృద్ధి జరుగుతుండేది. కానీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి బదులు కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతుండటం చూస్తున్న ప్రజలు, ఇప్పుడు దానిని నమ్మి ఎన్నుకునందుకు పశ్చాత్తాపపడకుండా ఉంటారా?వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను గద్దె దించి మళ్ళీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టకుండా ఉంటారా?కేవలం రాజకీయాలు చేసేందుకు ప్రజలు తమని ఎన్నుకొని అధికారం కట్టబెట్టలేదని అధికారంలో ఉన్న ప్రతీ ఒక్కరూ గ్రహిస్తే మంచిది.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…