
తెలంగాణ రాజకీయాలలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో కాంగ్రెస్ అధిష్టానం సిఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్చనిచ్చింది. ఆయనకు అండగా నిలబడుతోంది. కనుక ఆయన కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూ అధిష్టానానికి విధేయంగా మెసులుకుంటున్నారు.
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఇంత పలుకుబడి ఉన్నందునే పార్టీలో సీనియర్లు, మంత్రులు కూడా ఆయన మాట జవ దాటడం లేదని చెప్పొచ్చు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకే పరిమితం కాలేదు. నాయకత్వ లోపం, వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు చక్కటి సలహాలు కూడా ఇస్తున్నారు.
గత ఏడాది తెలంగాణలో కుల గణన (సర్వే) చేయించి, దేశ వ్యాప్తంగా కుల గణనకు పట్టుబట్టాలని, దీంతో కాంగ్రెస్ పార్టీకి మంచి రాజకీయ మైలేజ్ వస్తుందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. అది పట్టించుకుందో లేదో తెలీదు కానీ మోడీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి సలహాను చెవి కెక్కించుకుంది.
కుల గణన చేసి ఆ డేటా చేతిలో పెట్టుకుంటే దేశ రాజకీయాలను శాశించవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. కనుక జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టబోతోంది.
ఒకవేళ రేవంత్ రెడ్డి సలహాను పాటించి కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశం గట్టిగా మాట్లాడి ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత రాజకీయ మైలేజ్ లభించేది. కానీ మాట్లాడకపోవడంతో మోడీ ప్రభుత్వం కుల గణనకు సిద్దమవుతుంటే కనీసం ఆ క్రెడిట్ కూడా క్లెయిమ్ చేసుకోలేకపోయింది.
ఇప్పుడు డీలిమిటేషన్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానానికి దాని లోటుపాట్లు, పర్యవసానాలు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య పెరిగే అంతరాల గురించి వివరించారు. కనుక దీనిని గట్టిగా వ్యతిరేకించడం అవసరమని నొక్కి చెప్పారు.
కనుక కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై రేవంత్ రెడ్డి సలహాను పాటించి పార్లమెంట్ లోపల, బయట వ్యతిరేకిస్తే, దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాధరణ మళ్ళీ పెరుగుతుంది.
కానీ ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాలకు, అక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ వాదనతో నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి.
ఒకప్పుడు కంటి చూపుతో దేశ రాజకీయాలను శాశించిన కాంగ్రెస్ అధిష్టానం దాదాపు 15 ఏళ్ళుగా కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారానికి దూరమైంది. రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో వరుసగా ఓడిపోతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలను పాటిస్తే కొత్తగా నష్టపోయేదీ ఏమీ ఉండదు. ప్రయత్నిస్తే ఎంతో కొంత మేలు జరుగవచ్చు.
The Janhvi Kapoor deepfake controversy may end up being remembered for something bigger than the…
For Dada, the wait is over. Balakrishna is back on the sets, the actor joining…