
ఒక ప్రభుత్వం కూలిపోయేందుకు ఒక ఎంపీ, ఎమ్మెల్యే చాలు. అధికారంలో ఉన్న ఓ ప్రభుత్వం ఓడిపోయేందుకు ఉల్లి ధరలు చాలు.
అటువంటిది అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసపెట్టి పెద్దల భవనాలు, నిరుపేదల రేకుల షెడ్లు కూల్చేస్తుంటే, బాధితులు అందరూ ఆయనకు వ్యతిరేకంగా చేతులు కలపకుండా ఉంటారా?కలిపితే ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి ‘హైడ్రా’ సరిపోదా?
అయినా ఏం చూసుకొని రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా హైడ్రాతో ముందుకు సాగుతున్నారు?ఇంకా ఎంతకాలం ఈ హైడ్రా హడావుడి కొనసాగుతుంది? అనే సందేహాలు కలగడం సహజం.
ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఇరుగుపొరుగు దేశాలవారికి రహస్యంగా ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఇచ్చే రాజకీయ పార్టీలున్న మన దేశంలో, ఉన్న ఓటు బ్యాంక్‌ని దెబ్బ తీసుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? కేసీఆర్ వంటి మహామేధావిని ఓడించిన రేవంత్ రెడ్డి అటువంటి తప్పు అసలే చేయరు. కనుక ఈవిషయంలో ఆయన పూర్తి అవగాహన, లెక్కలతోనే హైడ్రాని ఉరికిస్తున్నారని చెప్పవచ్చు.
ఈరోజు ప్రజాపాలన దినోత్సవంలో మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి హైడ్రా తగ్గేదేలే అని మరోసారి స్పష్టం చేయడం చూస్తే, ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కూడా లభించిందనే భావించవచ్చు. ఆయన ధీమాకు బహుశః ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు.
ఇప్పటివరకు జరిగిన హైడ్రా కూల్చివేతలను పరిశీలిస్తే పేదల ఇళ్ళ కంటే పెద్దలవే ఎక్కువున్నాయని స్పష్టమవుతుంది. పేదల ఇళ్ళు కూల్చేయాల్సి వస్తే వారికి ‘డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్’ ఇస్తామన్నారు. కనుక తాత్కాలికంగా వారు ఆగ్రహావేశాలకు లోనయినప్పటికీ ‘డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్’ సర్వరోగ నివారిణిలా వారి తాపాన్ని తగ్గిస్తుంది.
ఇక అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక హైడ్రా బాధితులలో కాంగ్రెస్ వారికి ప్రత్యామ్నాయంగా ఉపశమనం కలిగించడం పెద్ద కష్టం కాదు.
బీజేపీతో పెట్టుకుంటే ఏమవుతుందో కేసీఆర్ పరిస్థితి చూస్తే అర్దమవుతుంది కనుక హైడ్రా అటువైపు వెళ్ళకుండా రేవంత్ రెడ్డి కట్టడి చేసే ఉంటారు.
ఇక మిగిలింది బీజేపీ, బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలే. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తామని ఎగిరెగిరిపడిన మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ కాలేజీ గోడ కూల్చేయగానే ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. అదేవిదంగా బిఆర్ఎస్ పార్టీలో అందరినీ కాకపోయినా కొందరినైనా హైడ్రాతో లొంగదీసుకోవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారేమో? మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీలు ఓ చెరువులో 13 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజీ పేరుతో 13 భవనాలు కట్టేసుకున్నారు. కనుక రేవంత్ రెడ్డి హైడ్రాని వాటివైపు పంపిస్తారా లేదా?అనేది కాంగ్రెస్-మజ్లీస్ సంబంధాలు ఎంత బలపడతాయనే దానిపై ఆధారపడి ఉండవచ్చు.
కనుక రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు వెనుక గొప్ప ఆశయం ఉందని, ఎటువంటి రాజకీయ దురుద్దేశ్యం లేదని చెప్పుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా ఉందనే భావించవచ్చు.
ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డికి ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు, కారణాలు ఏవీ లేకపోతే వచ్చే ఏడాదికి హైదరాబాద్‌లో ఆక్రమణలన్నీ తొలగిపోయి, మూసీనదిలో గోదావరి నీళ్ళు గలగల ప్రవహించాలి. ఆక్రమణల నుంచి హైదరాబాద్‌ని విముక్తి కల్పించినందుకు రియల్ లైఫ్ హీరోగా అవార్డు ఇవ్వక తప్పదు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…