
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మద్య యుద్ధంగా మారడం ఎవరూ ఊహించనిదే. రేవంత్ రెడ్డి మాటలలో ఇటీవల తరచుగా సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ అనే రెండు మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. కనుక అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక వేరే కారణాలు కూడా ఉండి ఉండొచ్చు. కానీ దీనికంతటికీ వారిద్దరి అహం దెబ్బతినడమే కారణంగా కనిపిస్తోంది.
ఈ స్టోరీలో అల్లు అర్జున్ వెర్షన్ వేరేగా చెప్పుకున్నాము. కనుక ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కోణంలో నుంచి చూస్తే, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్న ఆయనకు మనోభావాలు ఉండవా దెబ్బ తినవా?అంటే ఉంటాయి తింటాయని అందరూ అందరూ అంగీకరిస్తారు.
అయితే ఈ మనోభావాల కధ పుష్ప-2తోనే మొదలవలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సినీ ప్రముఖులు పట్టించుకోనప్పుడే మొదలైంది. అంతకు ముందు కేటీఆర్, బిఆర్ఎస్ మంత్రులతో రాసుకు పూసుకు తిరిగిన సినీ ప్రముఖులు తనని, తన ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి అహం దెబ్బ తినకుండా ఉంటుందా?అయినా తగ్గారు.
ఆ తర్వాత నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులు ఇద్దామనే సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనని సినీ పరిశ్రమ పట్టించుకోకపోవడంతో రెండోసారి ఆయన అహం దెబ్బ తింది. అయినా తగ్గారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ సినీ ప్రముఖులు చిన్న వీడియో ప్రకటనలు రూపొందించి ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా రెండుసార్లు కోరినా సినీ పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదు. ఇదీ రేవంత్ రెడ్డి అహం దెబ్బ తినడానికి మరో కారణం అయ్యుండవచ్చు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తగ్గారు.
పుష్ప-2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు, ప్రివిలేజ్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించినా అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పకపోవడంతో రేవంత్ రెడ్డి అహం మరోసారి దెబ్బ తిని ఉండొచ్చు. అయితే ఇంత మాత్రానికే ఈ వంకతో అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. కానీ ఏదో బలమైన కారణంతోనే ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. దాని గురించి తర్వాత చెప్పుకుందాం.
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టడం ద్వారా అరెస్ట్ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అందరూ తప్పు పడుతున్నట్లే స్పష్టంగా సూచించారు. కనుక రేవంత్ రెడ్డి అహం ఒక్కసారి .. కాదు అనేకసార్లు దెబ్బ తింది. అందుకే నిన్న అసెంబ్లీలో సినీ పరిశ్రమపై నిప్పులు చెరిగారని చెప్పొచ్చు.
అయితే నిన్న అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి వాదనలని అల్లు అర్జున్ అభిమానులు, సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయినా, తెలంగాణ సమాజం తప్పక ఏకీభవిస్తుంది. ఎందువల్ల అంటే సినీ పరిశ్రమని ఆంధ్రాకు చెందినదిగానే చూస్తుంది కనుక. ఇప్పటి వరకు జరిగిన ఈ యుద్ధంలో సిఎం రేవంత్ రెడ్డి పైచేయి సాధించిన్నట్లే భావించవచ్చు.
ఈ పరిణామాలను సినీ పరిశ్రమ జీర్ణించుకోవడం, ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని తట్టుకోవడం రెండూ కష్టమే. కనుక రాజీకి రాయబారం తప్పదు. అదే జరిగితే రేవంత్ రెడ్డి అంతిమ విజయం సాధించిన్నట్లవుతుంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…