
ఆంధ్రా పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారంటూ కేసీఆర్ ‘నీళ్ళు, నిధులు, నియమకాలు’ పేరుతో 13 ఏళ్ళు ప్రజల చేత ఉద్యమాలు చేయించి తెలంగాణ సాధించుకున్నారు. తర్వాత ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కనుక చకచకా ఉద్యోగాల భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ ఆయన ఉద్యోగాల భర్తీని కూడా తన బిఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకోవాలని ప్రయత్నించారు! బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తేనే ఉద్యోగాలన్నట్లు భర్తీ ప్రక్రియను సాగదీసుకుంటూ పోయారు తప్ప భర్తీ చేయలేదు.
చేసే పనిలో చిత్తశుద్ధి, నిబద్దత, నిజాయితీ లేకపోతే దానికి దేవుడు కూడా తోడ్పడడంటారు పెద్దలు. కేసీఆర్ విషయంలో అదే జరిగింది.
టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్స్ ప్రకటించడం, దానిపై అభ్యంతరాలు చెపుతూ కోర్టులో కేసులు దాఖలవడం, అవి కాకపోతే పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రాలు లీక్ అవడం, లేదా పరీక్షల నిర్వహణలో లోపాలతో పరీక్షలు రద్దు కావడం, ఏదో విదంగా నిర్వహించాలనుకుంటే చివరికి ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో కేసీఆర్ ఉద్యోగాల భర్తీ పెద్ద డ్రామాగా మిగిలిపోయింది.
దాని వలన లక్షలాదిమంది నిరుద్యోగులు ఎంతగానో నష్టపోయారు. వారి ఆగ్రహమే కేసీఆర్ కొంప ముంచేసింది. ఎన్నికలలో ఓడిపోవడానికి ఇదీ ఓ కారణమైంది!
ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా సరిగ్గా కేసీఆర్ పద్దతిలోనే ఉద్యోగాల భర్తీ డ్రామాని సాగదీసుకొంటూ, ఎన్నికల షెడ్యూల్ జారీ కాబోయే ముందు 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ డీఎస్సీ-2024 ప్రకటించింది.
ఒకవేళ జగన్ ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీలో నిబద్దత, నిజాయితీ ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలాగా అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై దృష్టి పెట్టి పనిచేయాలి.
కేసీఆర్ హయంలో నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీకి ఏర్పడిన న్యాయపరమైన అవరోధాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించి వేలాదిమందికి నియామక పత్రాలు అందజేస్తున్నారు.
అలాగే గ్రూప్-1, డీఎస్సీ-2023 లలో సమస్యలు నెలకొని ఉండటంతో వాటిని రద్దు చేసి మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్స్ జారీ చేయించారు.
కేసీఆర్ హయాంలో 5,089 ఉపాద్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2023నోటిఫికేషన్ ఇవ్వగా, ఎన్నికల కారణంగా అది అటకెక్కిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వాటికి అదనంగా మరో 5,973 పోస్టులతో కలిపి మొత్తం 11,062 పోస్టులకు నేడు (గురువారం) స్వయంగా నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియని 6-8 నెలల్లోగా పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఉద్యోగాల భర్తీలో ఆయనకు నిబద్దత ఉందని గ్రహించేందుకు ఇదే నిదర్శనం కాగా జగన్ ప్రభుత్వానికి నిబద్దత లేదని చెప్పేందుకు ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు డీఎస్సీ-2024 ప్రకటించడమే నిదర్శనం.
నిరుద్యోగులకు, వారి కుటుంబాలకు నోటిఫికేషన్స్ ఎర వేసి వారి ఓట్లు దండుకోవాలని అతితెలివి ప్రదర్శించినందుకే కేసీఆర్ గద్దె దిగవలసి వచ్చింది. ఆయన బాటలోనే డీఎస్సీ-2024 పేరుతో డ్రామా చేస్తున్న జగన్ ప్రభుత్వానికి కూడా బహుశః అటువంటి ఫలితమే రావచ్చు.
కొస మెరుపు ఏమిటంటే, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, ఆ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, తాజాగా ఈ తెలంగాణ డీఎస్సీ-2024 గురించి సాక్షి మీడియాలోనే పుంఖాను పుంఖాలుగా వార్తలు వేసుకుంటారు. అయినా ‘మాకు మూడు రాజధానులు… మూడు కాళ్ళ కుందేళ్ళే చాలు…’ అని వైసీపిలు సగర్వంగా చెప్పుకోవడం గొప్ప విషయమే కదా?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…