
Revanth Reddy KCR Family Assets Allegations
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్ల సభలో కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులున్నాయో మరో జాబితా ప్రకటించారు. దీంతో ఏం జరుగుతుంది? అంటే మళ్ళీ రెండు పార్టీల మద్య కొత్త యుద్ధం మొదలవుతుంది. అంతే!
ఇటీవల శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ అయిన భూములే సుమారు 800 ఎకరాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిపై సర్వే జరిపించి ఆ నివేదికల ఆధారంగా నలుగురు ఉన్నతస్థాయి అధికారుల కమిటీతో విచారణ జరిపిస్తున్నారు.
అది ఇంకా పూర్తికాక మునుపే నిన్న సభలో కేటీఆర్ కుటుంభానికి ‘హైటెక్ సిటీ వద్ద మూడు ఫైవ్ స్టార్ హోటల్స్’ ఉన్నాయంటూ సిఎం రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు, ఆయన కుమారుడు సంతోష్ రావులకు కూడా వందల ఎకరాలున్నాయని, ఇవి కాక విదేశాలలో కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేవలం పదేళ్ళ పాలనలో లక్ష కోట్లకు పైగా విలువగల ఆస్తులు ఏవిధంగా సంపాదించారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అయితే ఇక్కడ ఆలోచించాల్సింది కల్వకుంట్ల అక్రమాస్తుల గురించి కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ అక్రమాస్తుల గురించి తనకు తెలుసునని ఇంత బహిరంగంగా చెపుతున్నారు తప్ప వాటిపై విచారణ జరిపించి, దౌర్జన్యంగా లేదా అవినీతి సొమ్ముతో వాటిని కొనుగోలు చేశారని నిరూపించి వారికి శిక్షలుపడేలా ఎందుకు చేయడం లేదని ఆలోచించాలి.
కల్వకుంట్ల కుటుంబం అవినీతి గురించి ప్రజలకు తెలియజేసి, వారి ముందు దోషులుగా నిలబెడితే చాలనుకుంటున్నట్లు అనిపిస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఓడించి, మళ్ళీ తన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలు. అదే.. కల్వకుంట్ల కుటుంబానికి విధించగల పెద్ద శిక్ష అని భావిస్తున్నట్లనిపిస్తోంది.
అంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిసి ఉన్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదన్న మాట! అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంచుమించు ఈవిధంగానే దోపిడీ సాగుతోందనేది బహిరంగ రహస్యం.
అంటే రాజకీయ పార్టీల మద్య, వాటి నాయకుల మద్య ఎంత బద్ద శత్రుత్వం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పుడు ఒకరి ఆస్తుల జోలికి మరొకరు పోకూడదనే అప్రకటిత ఒప్పందానికి అందరూ కట్టుబడినట్లు అనిపిస్తుంది. ఈవిధంగా ఆరోపణలతో సరిపెడుతుండటం ‘రాజకీయ ఉదారత’ అనుకోవాలేమో? తద్వారా ఎవరు అధికారంలో ఉంటే వారు ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చనే అప్రకటిత నిబందనకు అందరూ కట్టుబడి ఉన్నారనుకోవాల్సి ఉంటుంది.
ఓ పక్క రాజకీయ నాయకులు ఈవిధంగా వందలు, వేల ఎకరాలు, ఫామ్‌హౌసులు సంపాదించుకుంటూ, మరో పక్క అభివృద్ధి పనుల పేరుతో నిరుపేద రైతుల భూములు గుంజుకొని వారిని రోడ్డున పడేస్తుండటం చాలా బాధాకరం. కంచే చేను మేస్తే… అంటే ఇదేనేమో?
Following the terrible failure of Gandhi Talks, Vijay Sethupathi has returned with the film Baththa,…
There is a strange rule attached to women in the public eye: they can grow…