
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలాగే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి నిలిచిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు గట్టిగా వాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ఆలోచించదనే అపోహ కూడా ఉండేది.
కానీ రేవంత్ రెడ్డి సిఎంగా అధికారం చేపట్టగానే రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యి వారి సలహాలు సూచనలు తీసుకొని, హైదరాబాద్ శివార్లలో అతిపెద్ద ఫార్మా సిటీ ఒకటి ఏర్పాటు చేయడం కంటే చిన్నచిన్నవి పది ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు.
అలాగే హైదరాబాద్ మెట్రోని విమానాశ్రయం వరకు పొడిగింపు విషయంలో తనదైన ముద్రవేస్తున్నారు. దానిని నగరంలో మరిన్ని ప్రాంతాల ప్రజలందరికీ ఉపయోగపడేవిదంగా దాని కారిడార్ డిజైన్‌లో కొన్ని మార్పులు సూచించారు.
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నెలరోజులకే దావోస్ సదస్సుకి వెళ్ళి తెలంగాణకు రూ.37,870 కోట్లు పెట్టుబడులు సాధించుకున్నారు.
గతంలో కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడానికే మంత్రివర్గ సమావేశం అన్నట్లు ఉండేది. మంత్రులలో నాలుగురైదుగురికి తప్ప మిగిలిన ఎవరికీ ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ సిఎం రేవంత్ రెడ్డి తన మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. దీంతో మంత్రులు తమతమ శాఖల సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
గతంలో ప్రగతీభవన్, సచివాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కేసీఆర్ రాచరిక, నిరంకుశ పోకడలు ప్రదర్శించేవారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి అందరినీ లోనికి ఆహ్వానించడమే కాకుండా వారితో స్వయంగా తాను, మంత్రులు కూడా నేరుగా మాట్లాడుతూ చక్కటి స్నేహపూరితమైన వాతావరణం నెలకొల్పారు.
కాంగ్రెస్ హామీలను అమలుచేస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి మంచి అనుభవజ్ఞుడిలాగే పాలన చేస్తున్నట్లు అర్దమవుతోంది. రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వంలో ఈ మార్పులను, ముఖ్యమంత్రి తీరుని స్వాగతిస్తున్నారు… అభినందిస్తున్నారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, జీవితంలో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇంత మంచి పేరు సంపాదించుకోగలిగినప్పుడు, ఐదేళ్ళు ఆంధ్రాని పాలించిన జగన్మోహన్ రెడ్డి చాలా మంచివారని ప్రజలు చెప్పవలసిన మాటను తానే స్వయంగా ఎందుకు చెప్పుకోవలసివస్తోంది?మంత్రుల చేతే ఎందుకు చెప్పించుకోవలసి వస్తోంది?
తన పాలన అద్భుతంగా ఉందని, ఏపీకి జగన్ అవసరం ఉందని స్టిక్కర్స్ కూడా అంటించుకున్నప్పుడు, మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు,నియోజకవర్గం ఇన్‌చార్జిలను ఎందుకు మార్చేసుకోవలసి వస్తోంది?ఎక్కడ తేడా కొట్టింది?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…