
తెలంగాణలో పదేళ్ళ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే ప్రజల మెప్పు పొందేందుకు సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. బహుశః మరికొన్ని రోజులు లేదా నెలలు ఈ హడావుడి కొనసాగించవచ్చు. కానీ ఆ తర్వాత అసలైన పరిపాలన చేయకతప్పదు. అందుకోసం నేడు 11 మంది మంత్రులకు శాఖలు కూడా కేటాయించేశారు. కనుక వారు కూడా వీలైనంత త్వరగా ‘పని’ మొదలుపెట్టక తప్పదు.
ఇంతకాలం ఏపీ ప్రజలు తెలంగాణ అభివృద్ధితో ఏపీని ఏవిదంగా పోల్చి చూసుకొన్నారో, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల పనితీరుని బిఆర్ఎస్ పాలనతో పోల్చి చూస్తారని వేరే చెప్పక్కరలేదు.
కేసీఆర్‌తో సహా మంత్రులు తమ పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా నడిపిస్తూ, పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. క్రీడలలో ఓ కొలమానం, సినిమా కలెక్షన్లలో ఓ రికార్డ్ ఏవిదంగా సెట్ అవుతుంటాయో, పాలనలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఓ కొలమానం, ఓ రికార్డ్ సృష్టించి పక్కకు తప్పుకొంది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే తరచూ ముఖ్యమంత్రుల మార్పు, పదవుల కోసం కీచులాటలు, పాలనలో అసమర్ధ, అవినీతి వంటి సర్వ అవలక్షణాలు ఉంటాయనే చెడు అభిప్రాయం ప్రజలలో చాలా బలంగా ఉంది. కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మంత్రులు అందరూ తమలో ఇటువంటి అవలక్షణాలు ఉంటే ముందుగా వాటిని వదిలించుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం సెట్ చేసిన స్టాండర్డ్స్ అధిగమించాల్సి ఉంటుంది. లేదా కనీసం వాటి దరిదాపులకైనా చేరుకోవలసి ఉంటుంది.
ఉదాహరణకు తెలంగాణ మునిసిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా కేసీఆర్ చేసిన కృషి, చూపిన నేర్పు, సమర్ధత అందరికీ తెలిసిందే. ఆయన తెచ్చిన పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఏర్పాటు చేయించిన ఐటి హబ్‌లు కళ్లెదుటే ఉన్నాయి.
అలాగే మునిసిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణాలు, పార్కుల సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన వంటివన్నీ కూడా ప్రజల కళ్లెదురుగానే ఉన్నాయి.
కనుక ఇప్పుడు ఆ శాఖలను చేపడుతున్న కాంగ్రెస్ మంత్రుల నుంచి కనీసం ఆ స్థాయిలో పనులు ఆశిస్తారు. అదేవిదంగా మిగిలిన శాఖల మంత్రులు కూడా మంచి పనితీరు కనబరచవలసి ఉంటుంది. ప్రజలందరూ తమ పనితీరుని ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంతో బేరీజు వేసుకొంటూ నిశితంగా గమనిస్తుంటారని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోకూడదు. ఒకవేళ ప్రజల అంచనాలు అందుకోవడంలో విఫలమైతే, ఇదే కాంగ్రెస్ పార్టీకి ఫాస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ కావచ్చు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గుర్తుంచుకొని శ్రద్ధగా పనిచేయడం చాలా చాలా అవసరం.
A blockbuster in one language creates curiosity in other markets, but that excitement doesn't last…
Aadi Saikumar, who last appeared in Shambhala, is gearing up for a new project with…