విడుదలై రెండు వారాలు గడుస్తున్నా “ఆర్ఆర్ఆర్” హంగామా ఇంకా ధియేటర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ప్రభావం వరుణ్ తేజ్ “గని” సినిమాపై తీవ్రంగా పడింది. రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కనీస వసూళ్లను కూడా సాధించలేక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిలపడింది. దీంతో వరుణ్ కెరీర్ లో ‘డిజాస్టర్’ ఫిగర్స్ నమోదవుతున్నాయి.
నిజానికి ఈ అంచనా ముందుగా ఊహించిందే. “గని” చిత్ర నిర్మాతలకు మరొక ప్రత్యామ్నాయ తేదీ లభించక “గని” సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయాల్సి రావడంతో, పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దీనికి కారణం వరుణ్ ని నిందించలేం గానీ, ఈ కారణంగా పంపిణీదారులు దారుణంగా బలయ్యారు.
“ఆర్ఆర్ఆర్” వంటి భారీ మల్టీస్టారర్ సినిమాను వెండితెరపై చూసిన తర్వాత, ఓ సాధారణ సినిమా ప్రేక్షకులను మెప్పించడం అనేది అనితర సాధ్యం. అది కూడా ఏ మాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ సబ్జెక్టుతో తెరకెక్కడం “గని” మినిమమ్ కలెక్షన్స్ కూడా నోచుకోకపోవడానికి కారణమయ్యింది. అయితే ఇది ఒక్క “గని”తో ఆగిపోతుందా? లేదా? అనేది చూడాలి.
“ఆర్ఆర్ఆర్”కు పోటీ అంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు సిద్ధమైన “కేజీఎఫ్” ఒక్కటే ఉంది. అయితే “ఆర్ఆర్ఆర్”కు లభించినంత పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ రివ్యూలు “కేజీఎఫ్” కూడా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బాక్సాఫీస్ వద్ద నిలబడ గలుగుతుంది. లేని పక్షంలో మరో రెండు వారాల పాటు బాక్సాఫీస్ ను ఏలడం “ఆర్ఆర్ఆర్”కు పెద్ద కష్టమైన విషయమేమి కాదు.



