రష్యాలో ఉద్యోగాల పేరుతో జరిగిన ఓ మోసం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. రష్యన్స్ ఇళ్ళలో పనిచేస్తే నెలకు రెండు లక్షలు జీతం లభిస్తుందని ఒక ఏజెంట్ చెప్పిన మాయమాటలు నమ్మిన నలుగురు తెలంగాణ యువకులు దారుణంగా మోసపోయారు.
ఒక్కొక్కరూ ఏజంట్‌కి మూడు లక్షలు చొప్పున చెల్లించి రష్యాలో అడుగుపెడితే అక్కడ దిగిన వెంటనే తమ పాస్ పోర్టులు తీసేసుకొని, ఓ మిలటరీ వాహనంలో సుమారు 12-15 గంటల సేపు ప్రయాణం తర్వాత ఓ సైనిక శిబిరానికి తీసుకెళ్లారని వారు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు..
మర్నాటి నుంచి తమకి సైనిక దుస్తులు ధరింపజేసి, చేతికి ఆయుధాలు ఇచ్చి వాటిని ఏవిధంగా ఉపయోగించాలో కొద్దిగా శిక్షణ ఇచ్చారని తెలిపారు.
తర్వాత తమని రష్యన్ సైనికులతో కలిపి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తరలించారని తెలిపారు. ప్రస్తుతం తాము రష్యా ఆధీనంలో గల ‘డొనెట్స్క్’ అనే ప్రాంతంలో ఉన్నామని, అక్కడ నిత్యం తుపాకులు, బాంబుల మోత మోగుతూనే ఉంటుందని, వారు తమ కుటుంబ సభ్యులకు ఆడియో మెసేజ్‌లు పంపారు.
తమను రష్యా తరపున ఉక్రెయిన్ దళాలతో యుద్ధం చేసేందుకు తీసుకువచ్చినట్లు గ్రహించిన తర్వాత చాలా భయం, ఆందోళనగా ఉందని వారు తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఆ నలుగురు యువకుల కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వారిని సురక్షితంగా భారత్‌కు తీసుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కనుక యుద్ధంలో ఉన్న ఏ దేశంలోనైనా భారీ వేతనంతో ఉద్యోగాలని ఏజెంట్లు చెప్పే మాయమాటలను యువత గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదం. నమ్మితే దేశం కాని దేశం కోసం తుపాకులు పట్టుకొని యుద్ధం చేయాల్సి రావచ్చు.. ప్రాణాలు కోల్పోవచ్చు.







