ఒక నాయకుడిగా జగన్ కు ఎంతటి విలువుందో, ఒక మీడియా ఛానల్ అయిన ‘సాక్షి’కి కూడా అంతే విలువుందని రాజకీయ, మీడియా వర్గాల్లో ఎపుడూ చర్చలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రసారాలతో విసుగు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అవినీతి సొమ్ముతో నడుస్తున్న మీడియాను స్వాధీనం చేసుకుని తీరుతాం అని ప్రకటించారు. దీనిపై కొంతవరకు చర్చలు జరిగినప్పటికీ, మరోవైపు జగన్ మీడియా ‘సాక్షి’ మాత్రం కధనాలలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రసారం చేస్తోంది.
ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పై సాక్షి మీడియా విలువల గురించి ప్రస్తావించడం విశేషం. “తెలంగాణాలో తన పార్టీ వారు టీఆర్ఎస్ లో చేరుతుంటే ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీ మార్పులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ, ఇపుడు ఏ ఉద్దేశంతో వైసీపీ వారిని తన పార్టీలో చేర్చుకుంటోందని, విలువలు లేని రాజకీయం టిడిపి చేస్తోందని” భారీ స్థాయిలో కధనాలకు తెరలేపింది.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చేసింది తప్పో, ఒప్పో కాసేపు పక్కన పెడితే… తెలుదేశం పార్టీని గాని, చంద్రబాబును గాని ప్రశ్నించడానికి అసలు ‘సాక్షి’ మీడియాకు నైతిక విలువలు ఉన్నాయా? సదరు మీడియా చెప్పిన విధంగానే తెలంగాణాలో టిడిపిని వదిలి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో… ఇదే మీడియాలో ఎపుడైనా టీఆర్ఎస్ చేసింది “విలువలు లేని రాజకీయం” అని గానీ, కేసీఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని గానీ ప్రసారం చేసిందా? ఒకవేళ ఆ సమయంలో కూడా ఇలాంటి విలువలతో కూడిన ప్రసారాలు చేసినట్లయితే, ఈ రోజు టిడిపిని “విలువలు” గురించి ఏకిపారేసే అవకాశం దక్కుండేది.
కానీ, తెలంగాణాలో తమ పార్టీతో పాటు తెలుగుదేశం కూడా అడ్రస్ గల్లంతవుతోందని సంబరాలు చేసుకునే విధంగా కధనాలు ప్రసారం చేసే సాక్షి మీడియా, ఇపుడు పరిస్థితి తన పార్టీ దాకా వచ్చేసరికి “విలువలు” గుర్తుకు రావడం హాస్యాస్పదమే కదా! మనం బాగున్నపుడు “లెక్కలు” (21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు) మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు “విలువలు” (తెలంగాణాలో ఒక వైఖరి, ఏపీలో మరో వైఖరి) మాట్లాడమంటే ఇదేనేమో!



