ప్రస్తుతం ప్రతి సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ తప్పనిసరిగా మారిపోయింది. అప్పట్లో ‘అమ్మోరు’ వంటి కొద్ది సినిమాలకే గ్రాఫిక్స్ మాయాజాలం చేసేవారు. అయితే ఇటీవల ప్రతి సినిమాకు, దాదాపుగా ప్రతి సందర్భంలో ఏదొక విధంగా గ్రాఫిక్స్ ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పాటలకైతే చెప్పనవసరం లేదు. అంతకు ముందు భారీ భారీ సెట్స్ వేసి పాటలను చిత్రీకరించేవారు, అయితే ప్రస్తుతం సెట్స్ కు బదులు అంతా బ్లూ, గ్రీన్ మ్యాట్ లపై చిత్రీకరించి, మిగిలినది గ్రాఫిక్స్ కు వదిలేస్తున్నారు.
ఇందుకు ఏ సినిమా కూడా మినహాయింపు కాదు. మరి ఇటీవల విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ఏ మేరకు గ్రాఫిక్స్ వర్క్ వినియోగించారో తాజాగా విడుదల చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. పెద్దగా కాకపోయినా, యాక్షన్ సన్నివేశాలలో, పాటలలో కాస్త గ్రాఫిక్స్ వర్క్ ఉందన్న విషయం ఈ వీడియో స్పష్టం చేసింది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టైటిల్ ట్రాక్ కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వెబ్ మీడియాలో మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో హల్చల్ చేస్తోంది.





