ఒక తెలుగు సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తుందా? అని చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి.’ విడుదలకు ముందు జరిగిన వ్యాపారమే కాదు, విడుదల తర్వాత సృష్టించిన సంచలన విజయాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే విడుదల తర్వాత ఏం జరగనుందో చెప్పలేం గానీ, “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ‘బాహుబలి’ని మించిపోయేలా చేస్తుండడం విశేషం.
‘బాహుబలి’ సినిమా నాలుగు భాషల్లో కలిపి దాదాపుగా 150 కోట్ల బిజినెస్ ను చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగుతో పాటు ఇందులో హిందీ, తమిళ, మలయాళ భాషలలో జరిగిన విలువ మొత్తం ఇది. అప్పట్లో ఇదే ఎక్కువ. అయితే, ఒక్క తెలుగు భాషలోనే నిర్మాణం జరుపుకుంటున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” అంచనాలకందని విధంగా బిజినెస్ జరుగుతుండడం ట్రేడ్ పండితులనే విస్మయానికి గురిచేస్తోంది.
నైజాం మొదలుకొని ఓవర్సీస్ వరకు ‘బాహుబలి’ రేంజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆడియో మరియు శాటిలైట్ హక్కులు కూడా కలుపుకుంటే దాదాపుగా 105 కోట్లకు చేరిందని టాక్. మరి ఇంత మొత్తంలో కలెక్షన్స్ ను ఈ సినిమా కొల్లగొడుతుందా? అత్యధిక టికెట్ల విక్రయం జరిగిన సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది కాబట్టే, అనితర సాధ్యమైన వసూల్లు సాధ్యమయ్యాయి. మరి ఆ స్థాయిలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అలరిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకమే.
ఒకవేళ అంచనాలకు తగ్గట్లుగా రాణించినా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే కనీసం 150 కోట్లు వసూల్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “అత్తారింటికి దారేది” సినిమా 84 కోట్ల షేర్ తో ఉంది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా కొన్న బయ్యర్లు లాభాలు రావాలంటే ముందుగా తన రికార్డులను బద్దలు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరి చూద్దాం… బాక్సాఫీస్ వద్ద పవన్ స్థామినా ఎంతో?



