‘సర్కార్ వారి పాట’ మొత్తం లీక్ చేసేస్తారా?

sarkaru vaari paata leaks againలీకులు లేకుండా “సర్కార్ వారి పాట”కు సంబంధించి ఏ ఒక్కటి రిలీజ్ కావడం లేదు. బహుశా సినిమాను కూడా ముందే లీక్ చేసేసి, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శిస్తారేమో అనే విధంగా ‘లీకులు’ వెంటాడుతున్నాయి. ఇన్ని లీకులు ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్నా, నిర్మాణ సంస్థ మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడం కొసమెరుపు.

ఇంతకీ లేటెస్ట్ లీక్ ఏమిటంటారా… ‘కాయిన్ ఫైట్’ అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట సందడి చేస్తున్నారు. ఈ మాస్ ఫైట్ ను వీక్షించిన నెటిజన్లు తమ అనుభూతులు పంచుకోవడం మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది. ఇలా రిలీజ్ కు ముందే అన్నీ లీక్ చేసేస్తే, రేపు వెండితెర పైన చూడడానికి ఏముంటుంది? అని మండిపడుతున్నారు.

ADVERTISEMENT

అసలే ప్రమోషన్స్ లేక విలవిలలాడుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ లీకుల బెడద వెంటాడుతోంది. వీటిపై మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నియంత్రణ లేకపోవడం అనేది అసలు ఊహించని పరిణామం. సినిమా అంతా పూర్తయిపోయి “ఆర్ఆర్ఆర్” వంటి సినిమాను దాదాపుగా ఏడాది కాలంగా కాపాడుకుంటూ వచ్చిన ఘనత ‘రాజమౌళి అండ్ కో’ది.

మరి రీజినల్ సినిమాగా తెరకెక్కుతోన్న “సర్కార్ వారి పాట” పట్ల మైత్రీ సంస్థకు ఇంత నిర్లక్ష్యం ఏమిటో అర్ధం కాని పరిస్థితి. ‘పుష్ప’ విడుదల సమయం నుండి ఈ సంస్థ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. బహుశా ఈ ట్రోలింగ్ కు అలవాటు పడిపోయారో ఏమో గానీ, అభిమానుల ఆవేదనను పట్టించుకునే విధంగా చర్యలు అయితే ఉండడం లేదు.

లీకుల వలన సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారో లేక వీటిని నియంత్రించేటంత శక్తి, సామర్ధ్యాలు ప్రొడక్షన్ వద్ద లేవేమో గానీ, “సర్కార్ వారి పాట” లీకులు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇలా కొంచెం కొంచెం కన్నా, సినిమా మొత్తాన్ని లీక్ చేసేస్తే ఓ పనైపోతుంది కదా అన్న నెటిజన్ల ఆవేదనను మైత్రీ సంస్థ పట్టించుకుంటుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories