
ఇదివరకు ఏపీ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు?అంటే కొంతకాలం యువగళం పాదయాత్రతో నారా లోకేష్ పేరు వినపడేది. ఆ తర్వాత వారాహి యాత్రలతో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేవారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన పేరే ఎక్కువగా వినిపించేది.
టిడిపి, జనసేనలు పొత్తు ప్రకటన చేసినప్పటి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్రజలు, మీడియా ఫోకస్‌లో ఎక్కువగా ఉండేవారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అర్దాంగి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి కూడా ప్రజలకు మద్యకు రావడంతో వారిద్దరూ కూడా ఏపీ రాజకీయాల్లో కొన్ని వారాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అయితే వైసీపిలో ఎవరూ లేరా? అంటే లేకనేమి… స్వయంగా జగనే ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసుకుంటూ వైసీపిలో ప్రకంపనలు పుట్టించేస్తూ ఒక్కసారిగా ‘న్యూస్ మేకర్’గా నిలుస్తున్నారు.
అయితే ఇదంతా ఒకప్పుడు! ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో ఏపీ రాజకీయాలలో ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. మరోవిదంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను పూర్తిగా ఆమె హైజాక్ చేశారని చెప్పవచ్చు. కారణం అందరికీ తెలిసిందే.
ఏపీలో అడుగుపెట్టడానికే ఇష్టపడని ఆమె ఇప్పుడు ఏపీలో దుమ్ము లేపుతున్నారు. అన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, వైసీపి అధినేతగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా అన్ని కోణాల నుంచి ఆమె చీల్చి చెండాడుతున్నారు.
వైసీపి నేతలెవరూ ఆమె ధాటికి తట్టుకోలేకపోతున్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆమెపై నేరుగా ఎదురుదాడి చేయలేక చంద్రబాబు నాయుడునే నిందిస్తున్నారు.
అయితే ఆమెను ఎదుర్కొనే ప్రయత్నంలో వైసీపి నేతలు చేస్తున్న విమర్శలతో తిరిగి వారే ఇబ్బంది పడే పరిస్థితి చేజేతులా కల్పించుకుంటున్నారు. ఉదాహరణకు వైవీ సుబ్బారెడ్డి ఆమె తన అన్నను ‘జగన్ రెడ్డి’ అంటూ సంభోదించడాన్ని తప్పు పడితే, “సరే ఇక నుంచి జగనన్న అనే సంభోదిస్తాను” అంటూ ఆమె “జగనన్న ఏపీని బ్రష్టు పట్టించేశాడు, జగనన్న రాష్ట్రాన్ని దోచేసుకొంటున్నాడు… జగనన్న కోసం నేను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడితే జగనన్న వల్లనే మా వైస్ కుటుంబం విడిపోయింది…” అంటూ ఆమె ప్రతీ మాటకు ముందు ఓ జగనన్న…వెనుకో జగనన్న తగిలిస్తూ మాట్లాడుతుంటే, ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటోంది.
ఆమె సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పోరాడుతుండటంతో, టిడిపి, జనసేనల ఉనికే కనిపించడం లేదు. వినిపించడం లేదు. జగన్ ప్రభుత్వంపై టిడిపి, జనసేన నేతల విమర్శలు, వారి పొత్తులు, కార్యక్రమాలు అన్నీ వైఎస్ షర్మిల చేస్తున్న ఈ హడావుడిలో చాలా పేలవంగా కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
మరో విధంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాలను, పార్టీలను వైఎస్ షర్మిల మూడు రోజులలోనే హైజాక్ చేశారని చెప్పక తప్పదు. ఆమె దూకుడు చూస్తుంటే, టిడిపి, జనసేనలు కూడా కాస్త దూకుడు పెంచాల్సిన అవసరం కనపడుతోంది. లేకపోతే ఎన్నికలకు ముందు సీన్ రివర్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కూడా!
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…