
రేపు రాఖీ పండగ. కనుక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఒకరోజు ముందుగానే జగనన్నని జ్ఞాపకం చేసుకున్నారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మద్యం కుంభకోణం కేసు విచారణ జరుగుతున్న తీరు కొండని తవ్వి ఎలుకని పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. ఎంతసేపు డిస్టిలరీలు, 3500 కోట్లు అవినీతి అంటూ చెప్పిందే చెపుతున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారని షర్మిల అన్నారు.
సిట్ అధికారులు కొండను తవ్వి ఎలుకలు పట్టుకొని సంతోషపడుతున్నారంటే, ఈ కేసులో మీకు మా జగనన్నదాక చేరేందుకు ఇంకా ఎంత కాలం పడుతుంది?మా అన్నని ఇంకా ఎప్పుడు లోపల వేస్తారని అడుగుతున్నట్లే ఉంది… కదా?
రాఖీ పండుగ సందర్భంగా ఆమె జగనన్నని గొప్పదనం గుర్తుచేసుకుంటూ, అన్నకి రెండు ప్రశ్నలు వేసి డొంక తిరుగుడు లేకుండా దయచేసి సూటిగా సమాధానం చెప్పాలని కోరారు. ఎందుకంటే మా జగనన్నకు సూటిగా సమాధానం చెప్పే అలవాటు లేదని, సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారని గతంలో కట్టిన రాఖీ సాక్షిగా షర్మిలే చెప్పారు.
యావత్ దేశంలో నగదు రహిత లావాదేవీలు జరుగుతుంటే, మీ హయంలో ఒక్క ఏపీలో మాత్రం మద్యం అమ్మకాలు నగదుకు మాత్రమే ఎందుకు అమ్మారని షర్మిల ప్రశ్నించారు.
సిఎం చంద్రబాబు నాయుడు కొన్ని నెలల క్రితం మద్యం కుంభకోణంపై శాసనసభలో శ్వేతపత్రం సమర్పించారు. దాని ప్రకారం జగన్ హయంలో లక్ష కోట్ల విలువగల మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. కానీ దానిలో కేవలం 600 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రభుత్వం ఖజానాలో జమా అయ్యాయని చెప్పారు. కనుక మిగిలిన రూ.99,400 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళాయో చెప్పాలని జగనన్నని ప్రశించారు.
శ్వేతపత్రంలో ప్రకారం రూ.99,400 కోట్లు మిస్సింగ్ అని సిఎం చంద్రబాబు నాయుడు చెపుతున్నప్పుడు, ఏసీబీ అధికారులు రూ.3,500 కోట్లు మాత్రమే అని ఎందుకు చెపుతున్నారని షర్మిల ప్రశ్నించారు.
కనుక ఈ కేసు విచారణపై కూడా తనకు చాలా అనుమానాలు కలుగుతున్నాయని షర్మిల అన్నారు. కనుక శ్వేతపత్రం ప్రకారమే సిఎం చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం కేసులో లెక్కలు తీయించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు జగనన్నని కనికరించి విడిచిపెట్టినా వైఎస్ షర్మిల మాత్రం విడిచిపెట్టేలా లేరనిపిస్తోంది. జగనన్నని వదల బొమ్మాళీ వదలా.. అంటూ వెంటపడేలాగే ఉన్నారు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…