
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ అన్న చెల్లెళ్ళ రాజకీయ సంబంధాలు వాటి ద్వారా ఏర్పడే బంధాలు విచిత్ర ధోరణిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత వైస్ జగన్ – షర్మిల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఇక వీళ్ళను ఆదర్శంగా తీసుకుని అటు తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సోదరి కవిత మధ్య రాజకీయ చిచ్చు రగిలింది. అలాగే కాపు కుల నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడ కుటుంబంలో కూడా అన్న వైసీపీ తో నడుస్తుంటే చెల్లి జనసేనతో రాజకీయ అరంగేట్రం చేసింది.
ఇక ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి ఈ అన్న చెల్లెళ్ళ రాజకీయ పోరు మొదలు కాబోతుందా.? అందుకు వైసీపీ తన రాజకీయంతో ఆజ్యం పోయడానికి సిద్ధమయ్యిందా.? అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చ జరుగుతుంది.
ఏపీ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రాజకీయ నాయకుడిగా వంగవీటి రంగా ఒక మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన మరణానంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవడానికి ఆయన సతీమణి వంగవీటి రత్న కుమారి మొదలు ఆయన కుమారుడు వంగవీటి రాధా వరకు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.
అయితే రాధా రాజకీయం కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి వైసీపీ, అక్కడి నుంచి టీడీపీ ఇలా స్థిరత్వం లేకుండా సాగడంతో తన తండ్రి రంగా కు ఉన్నంత రాజకీయ చరిష్మాను రాధా ప్రజల నుంచి పొందలేకపోయారు. ఇప్పటికి రాధా రాజకీయానికి రంగా వారసుడనే గుర్తింపే దక్కింది కానీ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సృష్టించుకోలేకపోయారు.
అలాగే 2024 ఎన్నికల ముందు నుంచి రాధా యాక్టీవ్ రాజకీయాలకు కాస్త దూరంగా జరగడంతో రంగా రాజకీయ వారసత్వానికి ఎండ్ కార్డు పడిందా అన్న అనుమానాలు రంగా అభిమానుల నుండి వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తానూ కొనసాగిస్తాను అంటూ తెరమీదకొచ్చారు రంగ కుమార్తె ఆశా కిరణ్.
నేడు రంగా వర్ధంతి కావడంతో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళ్లు అర్పించారు ఆశా కిరణ్. ఈ మధ్యకాలంలో ఆశా రాజకీయంగా యాక్టీవ్ అయ్యారు. భవిష్యత్ లో రాజకీయాలలోకి వస్తానని, కానీ ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అనేది రాధా రంగా మిత్రమండలిని అడిగి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో రంగా కుమారుడు రాధా ను పార్టీ నుంచి అవమానించి పంపిన వైసీపీ రంగా కుమార్తె కోసం రాజకీయం మొదలు పెట్టింది అనే చర్చ ఊపందుకుంది. అందులో భాగంగానే వైసీపీ ఆత్మ సాక్షి మొదలు జగన్ వరకు ఆశా కిరణ్ కోసం, కాపు సామాజిక వర్గ ఓట్ బ్యాంకు కోసం సిద్దమయినట్టు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.
అయితే తన అన్న రాధా ను గెంటేసిన వైసీపీ ఇప్పుడు తనకోసం వేస్తున్న గేలంలో ఆశా చిక్కుతారా.? అలాగే రంగా హత్యలో కీలక పాత్రదారుడిగా పేరొందిన దేవినేని కుటుంబం ఇప్పుడు వైసీపీ లో రాజకీయంగా యాక్టీవ్ గా ఉంది. మరి పాత కుటుంబ పగలను పక్కన పెట్టి ఆశా కిరణ్ వైసీపీ ఆశలను తన నిర్ణయాలతో నెరవేరుస్తారా.? లేక వారికి నిరాశనే మిగులుస్తారా.?
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…
Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…