
కర్ణాటక సిఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ఉదయం ప్రకటించారు. డెప్యూటీ సిఎం డీకే శివకుమార్ ఆ కుర్చీ కోసం గత రెండున్నరేళ్ళుగా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించాయి.
ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకోగానే నేరుగా సిఎం సిద్ధ రామయ్య ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టారు. తన కుర్చీ లాగేసుకొని కాళ్ళకు దణ్ణం పెడుతున్న డీకే శివ కుమార్‌ని ఆయన లోలోన ఎంతగా తిట్టుకున్నారో కానీ ఓ హగ్ ఇవ్వక తప్పలేదు.
ఈరోజు మధ్యాహ్నం 3-4 గంటల మద్య లోక్‌భవన్‌కి వెళ్ళి సిద్దరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యదర్శికి సమర్పించబోతున్నారు. ‘అన్నీ సవ్యంగా సాగితే’ ఈ నెల 30న డీకే శివకుమార్ కర్ణాటక సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
‘అన్నీ సవ్యంగా సాగితే’ అని దేనికంటే సిద్ధ రామయ్య రాజీనామా లేఖని సమర్పించేందుకుగాను ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరితే ఆయన కుటుంబ సమేతంగా ముంబయి వెళ్ళిపోయారు. కనుక ఆయన తిరిగి వచ్చే వరకు రాజీనామా ఆమోదం లభించదు.
ఇది వరకు కర్ణాటకలో బిజేపి ప్రభుత్వం అధికారంలో ఉండేది. దానిని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కనుక కర్ణాటకని మళ్ళీ చేజిక్కించుకోవాలని బిజేపి కోరుకోవడం సహజం.
సిఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్‌లో జరిగిన ఈ కుమ్ములాట, వాటి వలన సిద్దరామయ్య అయిష్టంగా రాజీనామా చేయాల్సి రావడం, తన అనుచరుడు జి.పరమేశ్వరన్ పేరు సిఫార్సు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకుండా డీకే. శివ కుమార్‌కి సిఎం పదవి కట్టాబెట్టాలనుకోవడం వంటి కాంగ్రెస్ అంతర్గత పరిణామాలు బిజేపికి ఓ గొప్ప అవకాశాన్ని సృష్టించి ఇచ్చాయి.
అందుకే గవర్నర్ హటాత్తుగా ముంబయి వెళ్ళిపోయారని, ఒకవేళ తిరిగి వచ్చి రాజీనామా ఆమోదించి, డీకే. శివ కుమార్‌ని సిఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకుండా నాన్చితే పరిస్థితి ఏమిటని రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆందోళన చెందుతోందని మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి.
ఇటీవల తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినా, దాని అధినేత విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించకుండా గవర్నర్ ముప్పతిప్పలు పెట్టడమే కర్ణాటక కాంగ్రెస్ ఆందోళనకి కారణంగా కనిపిస్తోంది.
ఒకవేళ తమిళనాడు గవర్నర్ కూడా డీకే.శివ కుమార్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించకుండా ఆలస్యం చేస్తే సిద్ధరామయ్య ప్రోత్సాహంతో జి.పరమేశ్వరన్ వర్గం తిరుగుబాటు చేస్తే? మొదటికే మోసం వస్తుంది.
అందుకే ‘అంతా సవ్యంగా సాగితేనే’ సిఎంగా డీకే.శివ కుమార్ ప్రమాణ స్వీకారం చేయగలుగుతారు. లేకుంటే సిద్దరామయ్య కోసం తవ్విన గోతిలో ఆయనతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా పడే ప్రమాదం ఉంటుంది.
Mumbai Indians had produced some of the brightest talents in Indian cricket in the form…
Veteran producer Vashu Bhagnani has invited another trouble for himself and his production house, Pooja…