
‘ఆగడు’ సినిమా నుండి ప్రారంభమైన శ్రీను వైట్ల కెరీర్ ప్రస్థానం, తాజాగా విడుదలైన ‘మిస్టర్’ సినిమాతో ప్రశ్నార్ధకంగా మారింది. వరుసగా మూడు దారుణ పరాజయాలను చవిచూడడం, సామాన్యమైన విషయమేమీ కాదు. అది కూడా ఒకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరో కాగా, మరొకటి రామ్ చరణ్ హీరో కాగా, అందులో మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ పాత్రలో చూపించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది.
అయితే ఆ రెండు సినిమాలంటే భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి, వాటిని అందుకోలేకపోయారని ఎంతో కొంత సర్దిచెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన ‘మిస్టర్’ పరిస్థితి వేరు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాను కూడా ప్రేక్షకులకు చేరువ చేయడంలో శ్రీను వైట్ల విఫలం అవ్వడంతో, తదుపరి సినిమాలో ఏ హీరో ఎవరు బలికాబోతున్నారో అన్న టాక్ వినపడుతోంది.
‘ఆగడు’ సినిమా విషయంలోనే శ్రీను వైట్ల తప్పటడుగులు వేసారని, మహేష్ ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ ‘దూకుడు’నే తీసి శ్రీను వృధా చేసుకున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ‘బ్రూస్ లీ’ విషయంలో తనకు తగినంత స్వేఛ్చ ఇవ్వలేదంటూ పరోక్షంగా ‘మెగా కాంపౌండ్’పై ఇటీవల శ్రీను వైట్ల విమర్శలు చేసారు. దానికి సరే అనుకున్నా… మరి ‘మిస్టర్’ విషయంలో ఎందుకు ‘డుమ్మా’ కొట్టింది అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బహుశా తదుపరి సినిమా విడుదలయ్యే సమయానికి ‘మిస్టర్’కు కూడా ఏదో కారణం చెప్తారన్న ఛలోక్తులు వినపడుతున్నాయి. ప్రస్తుతం ఒక్క దారుణ పరాజయం ఎదురైతే మరో అవకాశం రావడం ఇండస్ట్రీలో గగనమైపోయింది. కానీ, ‘ఆగడు’ తర్వాత ‘బ్రూస్ లీ’ అవకాశం వచ్చింది, మళ్ళీ తాజాగా కూడా మెగా కాంపౌండ్ ‘మిస్టర్’ను అందించింది. దీంతో శ్రీను వైట్ల కెరీర్ లో తదుపరి సినిమా అనేది పెద్ద “?”గా మారింది.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…