
ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి టీవీకె పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కానీ ఆయన రాజకీయ ప్రవేశం అనేక మంది కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది.
శనివారం రాత్రి కరూర్ పట్టణంలో అయన భారీ ర్యాలీ నిర్వహించారు. దానిలో అయన ప్రసంగిస్తున్నప్పుడు కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోవడం గమనించి వారికి ఆయన స్వయంగా నీళ్ళ బాటిల్స్ అందించబోతే తొక్కిసలాట మొదలైందని తెలుస్తోంది.
ఈ త్రొక్కిసలాటలో 36మంది చనిపోగా వారిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు, కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 58 మంది గాయపడ్డారు. వారిని కరూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాటకు కొన్ని కారణాలున్నాయి. మధ్యాహ్నం మొదలవాల్సిన ర్యాలీకి విజయ్ సుమారు 6 గంటలు ఆలస్యంగా వచ్చారు. అన్ని గంటలసేపు ఆయన కోసం జనం ఎండలో ఎదురుచూపులు చూస్తూ నీరసించిపోయారు.
ర్యాలీకి 10 వేలమంది మాత్రమే వస్తారనుకుంటే 30 వేల మందికి పైగా వచ్చారు. కనుక 10 వేలమందికి సరిపోయే ప్రదేశంలో 30 వేల మంది గుమిగూడటంతో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారింది. ప్రజలకు నీళ్ళ బాటిల్స్ అందించాలనుకోవడం, విజయ్ ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి కారణాల వలన ఇంత విషాదం సంభవించింది.
తమిళనాడు సిఎం స్టాలిన్ తక్షణం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించారు.
టీవీకె పార్టీతో తాను తమిళనాడు రాజకీయాలలో మార్పు తీసుకువస్తానని విజయ్ చెపుతున్నారు. కనుక వచ్చే ఏడాది జరుగబోయే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని ఒంటరిగానే పోటీ చేస్తామని చెపుతున్నారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని విజయ్ ప్రకటించుకున్నారు కూడా. ఆయనకు తమిళనాడులో లక్షల మంది అభిమానులున్నారు.
తద్వారా ఆయన అధికార డీఎంకే పార్టీకి, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలకు సవాలు విసురుతున్నట్లే. కనుక ఆయన రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఏమైనా కుట్ర జరిగిందా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో అయనకు తిరుగులేదని నిరూపించుకోవడానికి టీవీకె పార్టీ భారీగా జనసమీకరణ చేయడం వల్లనే ఈ విషాదం జరిగిందని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులు వారిస్తున్నా వినకుండా అంత ఇరుకు ప్రదేశంలో అంతమందితో ర్యాలీ నిర్వహించి అమాయక ప్రజల మృతికి విజయ్ కారకుడయ్యారని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
తొక్కిసలాటకు కారణం ఏదైనప్పటికీ వ్యక్తిగతంగా, రాజకీయంగా విజయ్‌కి, టీవీకే పార్టీకి ఇది తీరని అప్రదిష్ట మిగిల్చింది. రాజకీయాలలో శుభారంభం చేయబోతే ఇంత విషాదం జరగడంతో ఈ ప్రభావం అయన పార్టీపై తీవ్రం పడే అవకాశం ఉంటుంది.
ఈ విషాద ఘటనపై టీవీకే పార్టీ దాని అధినేత విజయ్ ఏవిదంగా స్పందిస్తారనేది కూడా కీలకంగానే మారబోతోంది. ఒకవేళ ఆయన ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తే తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి. దీనికి ఆయన నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటిస్తే ఆ ప్రభావం వేరేలా ఉంటుంది.
Toxic has emerged as a big disaster at the box office. Despite taking a huge…
Mirzapur The Film has finally arrived in theatres after a long wait. The popular franchise,…