గాలిలో దీపంలా హీరోయిన్ల కెరీర్లు

Star heroines careersదీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎంత పాత సామెతయినా దాంట్లో ఎన్ని తరాలు మారినా సరిపోయే అర్థం ఉంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది బాగా పనికి వస్తుంది. సరైన ప్లానింగ్ తో ఉంటే కనీసం పది పదిహేనేళ్ల ఫ్యూచర్ దక్కుతుంది. లేదా ఓటిటిలో కొత్త సినిమా వచ్చినంత వేగంగా ఇండస్ట్రీ నుంచి మాయమవ్వాల్సి ఉంటుంది. కొందరు హీరోయిన్లు ఇప్పుడీ దిశగానే ఉన్నారు. సరిగ్గా అడుగులు వేశారా సరేసరి లేదంటే ముందు ముందు తేడా కొట్టడం ఖాయమనేలా పరిస్థితులు మారిపోతున్నాయి. పన్నెండు వందల కోట్లు వసూలు చేసిన కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఏ పెద్ద స్టార్ నుంచి కాల్ రాలేదంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ అయ్యాక డైలమాలో పడిపోయింది.

ఇక నిన్నా మొన్నటి దాకా టాప్ చైర్ అనుకున్న పూజా హెగ్డేకు మెల్లగా ఆ సింహాసనం కాళ్ళు ఒక్కొక్కటిగా విరుగుతున్నాయి. 2022లో మరీ అన్యాయంగా వరస డిజాస్టర్లు భారీ దెబ్బ కొట్టాయి. రాధే శ్యామ్ ఘోరంగా పోయింది. దాని వల్ల ఎక్కువ నష్టపోయింది నిర్మాత తర్వాత ఇమేజ్ పరంగా పూజానే. చేయకపోయినా బాగుండేది అనిపించేలా ఆచార్య పీడకలలా మిగిలిపోయింది. తమిళంలో విజయ్ సరసన చేస్తే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అనుకుంటే బీస్ట్ కాస్తా నీళ్లలో తడిసిన టపాసులా తుస్సుమంది. ఇక బాలీవుడ్ మీద మోజు తగ్గక రణ్వీర్ సింగ్ సరసన సర్కస్ లో నటిస్తే అదేమో హిందీ సినిమాల చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా చోటు సంపాదించుకుంది.ఇప్పుడు చేతిలో ఉన్న మహేష్ బాబుది బ్లాక్ బస్టర్ అయితేనే ఇకపై ఆశలు పెంచుకోవచ్చు.

ADVERTISEMENT

ఇక సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ది మరో విచిత్రమైన కథ. పెద్ద సక్సెస్ దొరికింది. అందరూ సీత పాత్రలో తనను ఓ రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. ఇంకేముంది ఆఫర్లు క్యూ కడతాయనుకుంటే రివర్స్ లో స్టార్లు తనవైపు ఏమంత ఆసక్తి చూపించనట్టు కనిపిస్తోంది. నాని 30లో మృణాలే జోడి అంటున్నారు. ఒకటి రెండు కాదు వరసగా నాలుగైదు చేతిలో ఉన్నప్పుడే రేస్ లో పరుగులు పెట్టడానికి స్కోప్ ఉంటుంది. డీజే టిల్లు సెన్సేషన్ లో భాగమైన నేహా శెట్టికి వ్రతం బాగుంది ఫలితం చెడింది. అది కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ కావడంతో ఆశించిన పేరు రాలేదు.

ఇక రష్మిక మందన్నది ఇంకో గాథ. పుష్ప ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఇక్కడ కెరీర్ ని నిర్మించుకోవడానికి బోలెడంత స్కోప్ ఉండగా పూజా హెగ్డే లాగే ఏదో ఇండియా రేంజ్ లో వెలిగిపోవాలని హిందీ సినిమాలు ఒప్పుకుంది. గుడ్ బై బ్యాడ్ మూవీ అయ్యింది. మిషన్ మజ్ను థియేటర్ కు వర్కౌట్ కాదని ఓటిటికి ఇచ్చేశారు. వారసుడులో చేసినా విజయ్ సరసన హీరోయిన్లు ఫ్యాన్స్ కే కాదు దర్శకులకూ ఆనరు. అతనిదంతా వన్ మ్యాన్ షో. పైగా కాంట్రావర్సీగా మాట్లాడుతూ చిక్కులు తెచ్చుకోవడం కెరీర్ మీద ప్రభావం చూపిస్తోంది. ఒకపక్క శ్రీలీల లాంటి వాళ్ళు రోషన్ లాంటి యూత్ హీరోలతో రవితేజ లాంటి ఫిఫ్టీ ప్లస్ స్టార్లతోనూ జట్టు కట్టి దూసుకుపోతుంటే సరైన ప్రణాళిక లేని వాళ్ళు మాత్రం పైన చెప్పినట్టు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

ADVERTISEMENT
Latest Stories