
ఎన్టీఆర్ జిల్లా వీరవల్లి జెడ్పీ హైస్కూలులో ఓ ఉపాధ్యాయుడుపై విద్యార్ధి దాడి చేశాడు. సిగరెట్లు కాల్చవద్దని మందలించినందుకు!
గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వంటివారని గౌరవించే మన భారతీయ సమాజంలో ఓ విద్యార్ధి గురువుపై దాడి చేయడం ఆశ్చర్యం, బాధ కలిగిస్తాయి.
ఇది తప్పే… కానీ దీనికి ఎవరు బాధ్యులు? అంటే సిగరెట్ కాల్చి ఉపాధ్యాయుడిని కొట్టిన విద్యార్ధిదే అని ఏకగ్రీవ తీర్మానం చేసేయడం సులువు.
కానీ పిల్లలపై ప్రేమతో తల్లితండ్రులే వారిని ఒక్కొక్క ‘బుల్లిరాజు’లుగా మార్చుతున్నారంటే అతిశయోక్తి కాదు.
బాల్యం నుంచే సెల్ ఫోన్ చేతికి వస్తుంది. టీనేజ్ వచ్చేసరికి అదొక వ్యసనంగా మారుతుంది. సెల్ ఫోన్, వీడియో గేమ్స్, సోషల్ మీడియా… దానిలో రీల్స్… వ్యూస్, లైకులు పుణ్యమాని పిల్లలలో కోపం, ఆవేశం, అసహనం, చిరాకు, పరాకు వంటి అవలక్షణాలు పెరుగుతాయని అందరికీ తెలుసు.
దీనికి తోడు టీనేజ్ వయస్సులో కలిగే మార్పులు, స్నేహితులు, సినిమాలు, సోషల్ మీడియా, కుటుంబ పరిస్థితులు.. ఇలా అనేక ప్రభావాలు విద్యార్ధులపై ఉంటాయి.
ఇంట్లో తల్లితండ్రులతో, పాఠశాలలో ఉపాధ్యాయులతో కూడా ‘జనరేషన్ గ్యాప్ సమస్యలు’ ఉండనే ఉంటాయి. ఆ గ్యాప్… దాంతో వచ్చే సమస్యలు నానాటికీ పెరుగుతాయే తప్ప తగ్గవు.
ఇంట్లోనే ఇలాంటి ‘బుల్లి రాజులు’ని తయారుచేసి స్కూలు పంపిస్తే వారు చెయ్యి, నోరు వాడకుండా ఉంటారా? అలా వాడి అదే చాలా గొప్ప విషయమన్నట్లు సినిమాలో చూపించారు కదా?
బుల్లిరాజు స్థాయి తర్వాత హైస్కూల్ సినిమా స్టోరీలలో ‘లిప్ లాక్’ సీన్లు చూపిస్తూ, హీరోలకు ఎలివేషన్స్, ఫైట్స్, రక్తపాతం చూపిస్తారు. హీరోయిజం అంటే సిగరెట్, మందు, హీరోయిన్ల వెంటపడటం, ఇద్దరు ముగ్గురితో రొమాన్స్ చాలా గొప్పగా చూపిస్తారు!
ఇదే హీరోయిజం, ఇవే గొప్ప లక్షణాలన్నట్లు సినిమాలలో చూపిస్తున్నప్పుడు పిల్లలు వాటిని ఎంతోకొంత అనుకరించకుండా ఉంటారా?అనుకరిస్తే… ఇలా ఉపాధ్యాయులకు దెబ్బలు పడకుండా ఉంటాయా? చదువుకోవడానికి వచ్చిన పిల్లలు చెట్టాపట్టలేసుకొని ‘చాలా దూరం’ వెళ్ళకుండా ఉంటారా?
మన విద్యావ్యవస్థలో ఇలాంటి గురించి విద్యార్ధులతో చర్చించేందుకు, వివరించేందుకు ఉపాధ్యాయులకు సమయం, ఆసక్తి, ఓపిక ఉండవు.
ఎందుకంటే ఇంట్లో తల్లితండ్రులు, స్కూళ్ళు, కాలేజీలలో ఉపాధ్యాయులు అందరూ కూడా కేవలం పరీక్షలు, మార్కులు, ర్యాంకులే ముఖ్యమనుకుంటారు. సకాలంలో సిలబస్ పూర్తిచేసి పరీక్షలకు సిద్ధం చేయాలనుకుంటారు… తప్ప జీవితంలో ఎదురయ్యే పరీక్షలకు సిద్ధం చేయరు.
కనుక తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరి రూట్‌లో వారు సాగిపోతున్నప్పుడు ఇటువంటి అనూహ్యమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి.
తిలాపాపం తలో పిడికెడు…
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…