
తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు గడ్డం గీసుకోనని ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు శపధం చేశారు.
ఆయన ఇక జన్మలో గడ్డం గీసుకోవలసిన అవసరం ఉండదంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు జోకులు వేసేవారు. కాంగ్రెస్ నేతలు ఎల్లప్పుడూ తమలో తాము కుమ్ములాడుకుంటుండేవారు కనుక బిఆర్ఎస్ చెప్పింది వాస్తవమే అనిపించేది.
కానీ ఆయన అదృష్టం కొద్దీ, కాంగ్రెస్ పార్టీ అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షుడుగా ఎదిగి, శాసనసభ ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్లకు మళ్ళీ మంత్రి పదవులు దక్కేలా చేశారు.
కానీ తమిళనాడులో సొంతంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపిలు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడటం లేదు. కనుక ఆ రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్న డీఎంకే, అన్నాడీఎంకేలకు తోక పార్టీలుగా మిగిలిపోక తప్పలేదు.
కానీ బీజేపి కేంద్రంలో అధికారంలో ఉంది కనుక జయలలిత ఆకస్మిక మృతి తర్వాత అధికార అన్నాడీఎంకే పార్టీలో నేతల మద్య మొదలైన ఆధిపత్యపోరుని తనకు అనుకూలంగా మలుచుకొని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిమోట్ పద్దతిలో ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను కొంత కాలం శాసించగలిగింది.
కానీ తమిళ ప్రజలు డీఎంకే పార్టీని గెలిపించి బీజేపి ఎత్తులను చిత్తు చిత్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న స్టాలిన్ తన పార్టీని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌కి ఉప ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసి ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రీ కొడుకులిద్దరూ తమిళనాడు రాజకీయాలను శాశిస్తున్నారిప్పుడు.
కనుక మళ్ళీ ఏదో అద్భుతం లేదా ఊహించని రాజకీయ పరిణామాలు జరిగితే తప్ప తమిళనాడులో అన్నాడీఎంకే.. దానిని అడ్డుపెట్టుకొని బీజేపి అధికారంలోకి రావడం కల్ల.
ఈ విషయం తమిళనాడు బీజేపి అధ్యక్షుడు అన్నామలైకి తెలియదని అనుకోలేము. కానీ రాష్ట్రంలో డీఎంకేని గద్దె దించేవరకు చెప్పులు వేసుకోనని శపధం చేశారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో స్టాలిన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని నిరసన తెలియజేస్తూ కొరడాతో తనని తాను కొట్టుకున్నారు కూడా.
స్టాలిన్ అండ్ సన్స్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నాడీఎంకే నేతలు పోరాటాలు చేసినా, ఈవిదంగా కొరడాలతో కొట్టుకున్నా, ఇటువంటి శపధాలు చేసినా అర్దం చేసుకోవచ్చు.
కానీ రాష్ట్రంలో ఒక్కసారి కూడా సొంతంగా అధికారంలోకి రాలేకపోయిన బీజేపి, ఇటువంటి శపదాలు చేయడం, కొరడాతో కొట్టుకోవడం వలన ఏం ప్రయోజనం?
తెలంగాణ కాంగ్రెస్‌కి ‘బాహుబలి’ వంటి రేవంత్ రెడ్డి దొరికాడు.. గెలిపించాడు. అదేవిదంగా తమిళనాడు బీజేపిని గెలిపించి అధికారంలోకి తీసుకురాగల వారున్నారా?అంటే తమిళనాడు రాజకీయాలపై, అన్నాడీఎంకి మద్దతుగా ట్వీట్స్ వేస్తున్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆశాకిరణంగా కనిపిస్తున్నారు.
కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనే ఓకే ఒక్క పడవలోనే ప్రయాణించారు కనుక ఆ పార్టీని ఒడ్డుకు చేర్చగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాలు, రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. తమిళనాడు ఆయనకు మూడో పడవ అవుతుంది. కనుక తమిళనాడు బీజేపికి మరో ‘బాహుబలి’ దొరికే వరకు చెప్పులు లేకుండా కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సిందే.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…