
దేశంలో సంక్షేమ పధకాలకు ‘పేటెంట్ రైట్స్’ కలిగినట్లు భావించే వైసీపి ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోలో వాటిపై వెనకడుగు వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. టిడిపి, జనసేన, బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాతే వైసీపి తమ మ్యానిఫెస్టో విడుదల చేసింది. కనుక టిడిపి కంటే మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తామని ప్రకటించి ఉండాలి. కానీ ఈసారి ఎందుకో సంక్షేమ పధకాల విషయంలో పెద్దగా హామీలు ఇవ్వకుండానే ‘మమ’ అనిపించేసింది.
బహుశః తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఫార్ములాని వైసీపి కూడా ఫాలో అవుతుందేమో?కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పధకాలు అంటూ చాలా హామీలు ఇవ్వగా, బిఆర్ఎస్ పార్టీ పెద్దగా హామీలు ఇవ్వలేదు. దాని వలన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది కూడా.
మరి బిఆర్ఎస్ ఫార్ములా పనిచేయనప్పుడు వైసీపి దానిని ఎందుకు ఫాలో అవుతుందని సందేహం కలుగవచ్చు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేస్తోందని ప్రచారం చేసుకునే అవకాశం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి లబించింది.
కనుక ఏపీలో టిడిపి కూడా అలాగే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని అనుకుంటోందని జగన్, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటివారు జోరుగా ప్రచారం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలుచేయలేక ఇబ్బంది పడుతుండటం ఆంధ్రాలో ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. కనుక ఈ ప్రచారంతో వారిని నమ్మించగలిగితే వారందరూ గంపగుత్తగా వైసీపి వైపు వచ్చేస్తారని భావిస్తున్నట్లుంది.
కనుక టిడిపి, జనసేన, బీజేపీ మూడూ కూడా తమ ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీకి తాము కట్టుబడి ఉంటామని ఓటర్లకు గట్టిగా చెప్పుకోవలసి ఉంటుంది లేకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కానీ టిడిపి, జనసేన, బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో-వైసీపి మ్యానిఫెస్టోలను బేరీజు వేసుకొని చూస్తే వైసీపి మ్యానిఫెస్టో తేలిపోతుంది.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి, ప్రతీ ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.1500 పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఈ నాలుగు హామీలు సామాన్య ప్రజలను చాలా ఆకర్షిస్తాయి. కనుక ఈ నాలుగు పధకాల కోసమైనా వారందరూ టిడిపి, జనసేన, బీజేపీలకు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఉంటాయి.
వైసీపికి ఎంతో పేరు, బలమైన ఓటు బ్యాంకు సమకూర్చి పెట్టిన వృద్ధాప్య పింఛన్ విషయంలో కూడా వెనక్కు తగ్గడం కూటమికి చాలా కలిసి వచ్చే అంశమే.
వైసీపిని గెలిపిస్తే మరో మూడేళ్ళ వరకు నెలకు రూ.3,000 పించను మాత్రమే ఇచ్చి, మళ్ళీ ఎన్నికల సమయానికి ముందు అంటే 2028, 2029 సంవత్సరాలలో ఏడాదికి రూ.250 చొప్పున పెంచి రూ.3,500 ఇస్తామని వైసీపి మ్యానిఫెస్టోలో పేర్కొంది.
కానీ కూటమిని గెలిపిస్తే అధికారంలోకి రాగానే నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
కనుక ఇది కూడా ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపేలా చేయడం ఖాయం. ఇది జగన్మోహన్ రెడ్డికి, వైసీపి మేధావులకు తెలియదనుకోలేము. కానీ వారు ఎందుకో వెనక్కు తగ్గి కూటమి విజయావకాశాలు స్వయంగా పెంచారు.
బహుశః ఈసారి ఎలాగూ వైసీపికే 175 సీట్లు వస్తాయనే భ్రమలో ఉన్నారు కనుక ప్రజలకు కొత్త హామీలు, వరాలు ప్రకటించనవసరం లేదు…. కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోని పట్టించుకోనవసరం లేదని వైసీపి మేధావులు అనుకున్నారేమో?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…