
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీకి సిద్దమైన టిడిపి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. దానికి అది ఏవో కారణాలు చెప్పుకొంది. అది వార్తల్లో రాసుకోవడానికి, చదువుకోవడానికి పనికివస్తుంది. అయితే దీని వెనుక చాలా బలమైన కారణమే కనిపిస్తోంది.
తెలంగాణలో టిడిపి పోటీ చేస్తే ఏమవుతుంది?అని ఆలోచిస్తే చంద్రబాబు నాయుడుపై సానుభూతితో ఉన్న ఆంద్రా ఓటర్లు దాని వైపు ఎక్కువ మొగ్గుచూపేవారు. కానీ వారి ఓట్లతో టిడిపి కొన్ని సీట్లు గెలుచుకోగలిగి ఉండేది కానీ ఓట్లు చీలితే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే.
ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. కనుక కాంగ్రెస్‌ను నష్టపరిచే బదులు ఎన్నికలలో పోటీచేయకుండా వెనకుతగ్గడం ద్వారా దానికి పరోక్షంగా సహకరించడమే మంచిదని టిడిపి భావించి ఉండవచ్చు. తద్వారా ఆంద్రా ఓటర్లతో పాటు బీసీ, మైనార్టీల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే పడవచ్చు. కనుక కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతాయి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో వరుస విజయాల తర్వాత దాని తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే అవుతాయని వేరే చెప్పక్కరలేదు. అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కనుక తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి సహకరించినందుకు ప్రతిగా అది టిడిపికి సహకరించవచ్చు.
ఒకవేళ సహకరించకపోయినా, అది ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తుంది. అప్పుడు వైసీపిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి నేతలనే ముందుగా కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తుందని వేరే చెప్పక్కరలేదు.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ వారందరూ రారాజుల్లా ఓ వెలుగు వెలిగారు. కానీ వైసీపిలో చేరిన తర్వాత జగన్ ముందు చేతులు కట్టుకొని నిలబడవలసివస్తోంది. కనుక ఇంతకాలం వేరే ప్రత్యమ్నాయం లేక వైసీపిలో అయిష్టంగా కొనసాగుతున్న అటువంటి నేతలు వైసీపిని వీడి బయటకు వస్తే, అదే సమయంలో టిడిపి, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగితే ఏపీలో వైసీపికి ఓటమి తప్పదు.
చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మోడీ, అమిత్ షాలు మౌనంగా ఉండిపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టమైంది. అలాగే జనసేనను కూడా వారిద్దరూ పట్టించుకోవడం లేదు. కనుక టిడిపి, జనసేనలు ఇండియా కూటమివైపు, దానిలోని కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దపడితే వాటిని తప్పు పట్టలేము.
బహుశః ఈ ఆలోచనతోనే టిడిపి తెలంగాణ ఎన్నికలలో వెనక్కు తగ్గి ఉండవచ్చు. దాని ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగితే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై, వెంటనే జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపై తప్పకుండా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…