
కేసీఆర్ నాకు, నా కుటుంబానికి, నా పార్టీకి తెలంగాణలో ఎదురే లేదనుకున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు!
ఇటీవల గులాబీ సభ కోసం బయటకు వచ్చినప్పుడు ‘కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన శత్రువు’ అని కేసీఆర్ ఖరారు చేశారు. ఆయనే స్వయంగా ఈ మాటన్నారు కనుక కాంగ్రెస్ పార్టీతో రాజకీయ యుద్ధాలు చేసుకుంటూ, రేవంత్ రెడ్డిని ఓడించి అధికారం సంపాదించుకోవాలి.
కేసీఆర్‌కి ఇంకా ధైర్యం ఉంటే మళ్ళీ ప్రధాని మోడీతో కూడా యుద్ధాలు చేసి ఓడించి ప్రధాన మంత్రి కూడా కావచ్చు. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని సాయం కోరుతుంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కదా?
ఇంతకీ విషయం ఏమిటంటే, ఇక్కడ జగన్ మనస్సాక్షి ఎలాగో అక్కడ నమస్తే తెలంగాణ కేసీఆర్‌కి అటువంటిది. కేసీఆర్ మనసులో ఆశలు, ఆలోచనలు, కోరికలు, కోపం, బాధ, ద్వేషం, అసూయ, పగ వంటివన్నీ అద్దంలో కనపడినట్లు దానిలో కనబడుతుంటాయి.
ఈరోజు ‘నమస్తే తెలంగాణ’ ఆన్‌లైన్ ఎడిషన్‌లో “మనగుట్టు పొరుగు రాష్ట్రానికి.. బాబు బాటలో తెలంగాణ” అనే టైటిల్‌తో ఓ ఆర్టికల్ వేశారు.
దాని సారాంశం ఏమిటంటే, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తుంటే, తెలంగాణ సచివాలయంలో ఫైల్స్ కదులుతున్నాయి. ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులు కీలక పడవులలో నియమితులవుతున్నారు. చంద్రబాబు నాయుడు సూచించిన వారికే కాంట్రాక్టులు లభిస్తున్నాయి.
తెలంగాణ సీఎంవో పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్ళిపోయింది. ఆయన అమరావతి నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ అమరావతిలో నిర్ణయించబడుతుంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నని రోజులు చంద్రబాబు నాయుడు ఎన్ని పేచీలు పెట్టినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎలా చెపితే అలా నడుచుకుంటోంది.” ఇదీ దాని సారాంశం.
చంద్రబాబు నాయుడుపై బిఆర్ఎస్ పార్టీ ఇంతగా విషం కక్కుతున్నా ఆయన అసలు పట్టించుకోరు. పట్టించుకోకపోయినా ఏమవుతుందో 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ తెలుసుకున్నారు.
అయినా చంద్రబాబు నాయుడు భజన మానుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడుని ఇంతగా ద్వేషిస్తూనే, ఆయన పేరు చెప్పుకునే మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో పైచేయి సాధించి, అధికారంలోకి రావాలని కేసీఆర్ ఆశపడుతుండటం విడ్డూరమే కదా?
చంద్రబాబు నాయుడు చేతిలో తెలంగాణ సిఎం, ఆయన కార్యాలయం ఉందని చెపుతున్నారు సరే! బిఆర్ఎస్ పార్టీకి కూడా చంద్రబాబు నాయుడి పేరు చెప్పుకునే రాజకీయాలు చేయడం దేనికి?
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు తాము అందరి కంటే చాలా తెలివైనవారిమని, నిజాయితీ పరులమని, తెలంగాణ పట్ల తమకు తప్ప మరెవరికీ ప్రేమ ఉండదని గట్టిగా వాదిస్తుంటారు. కనుక వారు ఆవిదంగానే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని పోరాడాలి కానీ నిత్యం చంద్రబాబు నాయుడు భజన చేయడం దేనికి?
అంటే చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించకపోతే తెలంగాణ ప్రజలు కూడా తమని పట్టించుకోరని భావిస్తున్నారా?కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకెంత కాలం చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటారో?
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…