Telugu

సకల అవలక్షణాలతో దేశాభివృద్ధి ఎలా?

ఒకప్పుడు.. అంటే సుమారు నాలుగైదు దశాబ్దాల క్రితం దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక పెద్దగా పట్టించుకునేవి కావు. ఎందుకంటే అప్పుడు వారిని గట్టిగా నిలదీసి అడిగేవారు లేకపోవడమే.

ఒకవేళ ఉన్నా.. అధికార పార్టీల ముందు వారి గొంతులు చిన్నబోయేవి. కనుక దేశ ప్రజలు కూడా రాజకీయ నాయకుల హామీలను పెద్దగా పట్టించుకునేవారు కారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు హామీ ఇస్తే.. నాడు నక్షత్రకుడు సత్య హరిశ్చంద్రుడి వెంటపడినట్లు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పీక పట్టుకుంటున్నాయి.

కనుక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియక హామీలు ఇచ్చామని సంజాయిషీలు చెప్పుకోవడమో లేదా గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం వలన హామీలు అమలుచేయలేకపోతున్నామని ప్రజలకు నచ్చజెప్పుకోవాల్సి వస్తోంది. అయినా హామీల అమలు కోసం అప్పులు చేస్తూనే ఉన్నాయి.

అప్పుడూ.. ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారంటూ విమర్శిస్తుంటాయి. కనుక హామీల అమలు పులి మీద సవారీ చేయడం వంటిదే.

అయినా రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం మానడం లేదు. ముందు ఎన్నికలలో ఏదోలా గెలిచి అధికారంలోకి వస్తే చాలు తర్వాత చూసుకోవచ్చని ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూనే ఉన్నాయి. వాటిని ప్రతిపక్షం ఆయుధాలుగా స్వీకరించి అధికార పార్టీపై సంధిస్తూనే ఉంటుంది…గతంలో తాము ఇచ్చిన హామీలను అమలుచేయలేదనే సంగతి మరచినట్లు.

ఓ పక్క హామీల కోసం అప్పులే కొండంత ఉంటే, అభివృద్ధి పనుల కోసం చేసే అప్పులు వేరేగా ఉంటాయి. మళ్ళీ ఆ అభివృద్ధికి మీగడలా అవినీతి కూడా ఉంటుంది. కనుక అభివృద్ధి భారం కూడా సామాన్య ప్రజలే మోయాల్సి వస్తోంది.

ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్‌ హయంలో లక్ష కోట్లకుపైగా అవినీతి జరిగిందని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబం, మాజీ మంత్రులు, బీఆర్ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు సంపాదించుకున్నారంటూ రేవంత్ ప్రభుత్వం వాటిపై విచారణ జరిపేందుకు నలుగురు ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే గతంలో బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండగా ఆయనపై ఈడీ మనీలాండరింగ్ కేసు బుక్ చేసి ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేసింది.

అయన కుటుంబానికి చెందిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి దానిని తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్ళించుకుందని ఈడీ ఆరోపిస్తోంది. ఇది సుమారు రూ. 842 కోట్లు వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌ నీమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్‌ లక్ష్మీ భాస్కర్, మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిల నివాసాలపై ఏసీబీ అధికారులు ఇటీవల జరిపిన దాడులలో ఇద్దరూ సుమారు రూ.300-400 కోట్లు వరకు అక్రమాస్తులు సంపాదించుకున్నారని అంచనా వేశారు.

కనుక పాలకులు, అధికారుల, నాయకుల అసమర్ధత, అవినీతి కూడా రాష్ట్రాల పాలిట శాపంగా మారుతోందని స్పష్టమవుతోంది.

ఇన్ని ఆవలక్షణాలతో అలరారుతూ, దేశాన్ని అగ్రరాజ్యాల సరసన, రాష్ట్రాలను దేశంలో నం.1 స్థానంలో నిలబెడతామనే నేతల మాటలను ఎలా నమ్మగలం? అలాగని ప్రజలకు వేరే ఆప్షన్ ఉందా?

కనుక జెన్-జీ ఈ రాజకీయ ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా ఈ అవలక్షణాలకు విరుగుడు కనిపెట్టాలి. దేశాన్ని గాడిన పెట్టుకోవాలి. సాధ్యమేనా? సాధ్యమేనని ఒక్క మాట చెప్తే చాలా సంతోషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

సాయిరెడ్డి టార్గెట్ సజ్జలా.? జగనా.?

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన మాజీ పార్టీ తో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్…

51 seconds ago

Pics: Neha Shetty Serves Fresh Denim Style With Attitude

Neha Shetty brings a fresh fashion spark to this denim focused gallery, blending relaxed glamour…

16 minutes ago