
దీనికంతటికి కారణం బిజెపి అని టిఆర్ఎస్ నిందిస్తుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో పరువు కాపాడుకోవడం కోసం సిఎం కేసీఆరే మజ్లీస్ పార్టీతో కలిసి నగరంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిసే ఈ నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఈవిదంగా ఎవరి కధ వారు చెపుతున్నా, తెలంగాణలో హటాత్తుగా మారిన ఈ పరిస్థితులకు ఏదో ఓ పార్టీ మూల్యం చెల్లించకతప్పదు.
దేశంలో ఒక్కో రాష్ట్రంలో దొడ్డిదోవలో అధికారం చేజిక్కించుకొనేందుకు బిజెపి ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తమ తదుపరి లక్ష్యం తెలంగాణయే అని బిజెపి నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడితే, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది.
కనుక బిజెపి తన ట్రంప్ కార్డ్ (హిందూ-ముస్లింల మద్య విభేధాలు) తీసి ప్రయోగిస్తున్నట్లుంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌లో అగ్గి రగిలింది. అందుకు బిజెపి నుంచి అతనిని సస్పెండ్ చేసినప్పటికీ, బిజెపికి అనుకూలమైన వాతావరణం సృష్టించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.
మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్‌పై విరుచుకు పడుతున్నారు. ఇది తమ అధినేత కుమార్తె ప్రతిష్టకు సంబందించిన విషయం కావడంతో టిఆర్ఎస్ శ్రేణులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. బహుశః బిజెపి ఇదే కోరుకొంటోందేమో కూడా? కనుక టిఆర్ఎస్-బిజెపి శ్రేణుల మద్య ఎక్కడికక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి.
అంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్లు అర్దమవుతోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న హడావుడిగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవడం ఈ అనుమానానికి బలం చేకూర్చుతోంది. కనుక బిజెపి చేతిలో టిఆర్ఎస్ నలిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
అయితే అపర చాణక్యుడిగా పేరుగాంచిన సిఎం కేసీఆర్ బిజెపి ఎత్తులను ఊహించలేరనుకోవడం పొరపాటే. అందుకే వెంటనే హైదరాబాద్‌లో భారీగా పోలీసులను మోహరించి, బెయిల్‌పై బయటకు వచ్చిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ని మరో పాతకేసుతో మళ్ళీ లోపలకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ముస్లిం ప్రజల ఆగ్రహం చల్లారుతుంది. ముస్లింలు వెనక్కు తగ్గితే వారి నుంచి బిజెపికి అవసరమైన ఆక్సిజన్ అందక మంటలు చల్లారిపోతాయి.
కానీ హైదరాబాద్‌లో నెలకొన్న ఈ పరిస్థితులను ఉదాహరణగా చూపించి, బిజెపికి అధికారం ఇస్తే రాష్ట్రంలో ఇటువంటి యుద్ధవాతావరణమే వస్తుందని, అభివృద్ధి కుంటుపడుతుందని, కనుక రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలు కోరుకొంటున్నట్లయితే టిఆర్ఎస్‌కే ఓట్లు వేయాలని మునుగోడు ఉపఎన్నికలలో గట్టిగా ప్రచారం చేసుకొని విజయం సాధించగలదు.
కనుక టిఆర్ఎస్ కోసం తవ్విన మునుగోడు గోతిలో బిజెపియే పడే ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో ఏది పైచేయి సాధిస్తుందో త్వరలోనే తెలుస్తుంది.
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…