తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడేందుకు పావులు కదుపుతుంది. ఈ క్రమంలో హుజుర్ నగర్ ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజో రేపో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలు పెడతారు. కాంగ్రెస్, తెరాస పార్టీలు ఇద్దరూ రెడ్డి అభ్యర్థిని పెట్టడంతో టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలో దించాలని ప్రాధమికంగా అనుకున్నట్టు సమాచారం.
అయితే ఇక్కడ పోటీ ఆ పార్టీకి అంత తేలిక కాదు. చివరి సారిగా 2014లో ఇక్కడ పోటీ చేసింది టీడీపీ. అప్పుడు కాంగ్రెస్, తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరువాత నాలుగో స్థానంలో నిలిచింది. మహాకూటమిలో భాగంగా 2018 ఎన్నికల్లో ఈ సీటుని కాంగ్రెస్ కి విడిచిపెట్టింది. అంటే పది సంవత్సరాల తరువాత టీడీపీ ఇక్కడ నుండి పోటీ చేస్తుంది.
దానితో ఆ పార్టీ తన ఉనికిని చాటు కోవడానికి కూడా చాలా కష్టపడాలి. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే క్యాడర్ కు ఊపు వస్తుంది. చంద్రబాబు ప్రచారానికి వెళ్ళి అదే సమయంలో కేసీఆర్ ఆంధ్ర – తెలంగాణ సెంటిమెంట్ వాడకుండా చూడగలిగితేనే ఈ ప్రయోగం ఎంతో కొంత సఫలం అవుతుంది. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది.
ఇప్పటికే ఆయన తన భార్య పద్మావతి బరిలోకి దించారు. గత ఎన్నికలలో ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డికి మళ్ళీ టిక్కెట్ ఇచ్చింది తెరాస. తాజాగా బీజేపీ బీసీ అభ్యర్థి కోటా రామారావుని తమ అభ్యర్థిగా ప్రకటించింది. అక్టోబర్ 21 న పోలింగ్, 24న కౌంటింగ్ జరుగుతుంది.





