
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్, తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అనేకం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కనుక తమకు తెలుగు తల్లి వద్దనుకుని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజలు కూడా ఆమెని తమ తల్లిగానే భావించి ఊరూరా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై అభ్యంతరం తెలిపారు.
ఆ విగ్రహం కేసీఆర్ రాజరిక పోకడలకు నిదర్శనంగ ఉంది తప్ప సాధారణ ప్రజలకు ప్రతిరూపంగా లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ విగ్రహం తొలగిస్తామన హెచ్చరించారు. కానీ కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు అప్పుడు ఆయన విమర్శలను, హెచ్చరికలను పట్టించుకోలేదు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్చేశారు. సాధారణ మహిళ రూపురేఖలతో ఉన్న విగ్రహాన్ని సచివాలయం ఆవిష్కరించారు.
ఈసారి తాము అధికారంలోకి రాగానే ఆ కాంగ్రెస్ తల్లి విగ్రహం తొలగించి, ఆ తల్లి స్థానంలో తమ తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు హెచ్చరించారు. ఒకవేళ రేపు బీజేపి అధికారంలోకి వస్తే ఆ పార్టీ మరో తల్లిని పెట్టుకుంటుందేమో తెలీదు.
ఇదివరకు తెలుగు తల్లి మాది కాదని కేసీఆర్ అంటే అందరూ అర్దం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తల్లి వేరు, బిఆర్ఎస్ తల్లి వేరని రెండు పార్టీల మద్య పంచాయితీ మళ్ళీ మొయిదలైంది.
ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు సచివాలయంలో ఉన్న విగ్రహం వంటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోయారు. ఈ విషయం తెలుసుకొని బారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మద్య ఘర్షణలు జరిగాయి.
కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలని బిఆర్ఎస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే పెడతామని కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణ పడ్డాయి. పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
ఏపీలో అమరావతి రాజధాని విషయంలో కూడా జగన్ ఇదే విదంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతిని వద్దనుకొని మూడు రాజధానులు ప్రతిపాదన చేశారు. జగన్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ 5 ఏళ్ళలో మూడు రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ అమరావతి పనులు పునః ప్రారంభించారు. అమరావతి విషయంలో మళ్ళీ భవిష్యత్‌లో ఎన్నడూ ఇటువంటి వివాదం, వేరే ఆలోచనలు ఉండకూడదనుకున్న సిఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి అమరావతికి చట్ట బద్దత కల్పించాలని, దీని కోసం విభజన చట్టంలో సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ తల్లి విషయంలో కూడా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య వివాదం నెలకొని ఉన్నందున రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణ తల్లికి చట్ట బద్దత కల్పించేందుకు శాసనసభ చేత ఆమోదముద్ర వేయించడం అవసరమనిపిస్తుంది.
Paid negativity has become an increasingly familiar phrase whenever a big film enters a crucial…
For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…