ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీని మైథాలజీ అనే జాన్రా రాజ్యమేలుతోంది. బడా స్టార్లు, సీనియర్ డైరెక్టర్లు తమ సినిమాల్లో దేవుడి అంశ కచ్చితంగా ఉండాలని భీష్మించుకొని కూర్చున్నారు. పరభాషల్లోనూ ఈ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ.. తెలుగులో తెరకెక్కుతున్నంత భారీగా, హుందాగా మరో భాషలో ఈ మైథాలజీ థీమ్ సినిమా రావడం లేదు అనేది నిజం. హిందీలో రామాయణ వస్తున్నప్పటికీ.. ఆ టీజర్ కి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ అంచనాల్ని తలకిందులు చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు “వారణాసి”లో రాముడిగా కనిపించనున్నాడని తెలిసినప్పటి నుండి తెలుగు సినిమా అభిమానుల అంచనాలకి అవధులు లేకుండాపోయాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను అల్లూరి సీతారామరాజుగా చూసి, ఇప్పుడు మహేష్ ను రాముడిగా చూడబోతుండడం అనేది భలే ఎగ్జైటింగ్ విషయం. “కల్కి”లో ఆల్రెడీ కర్ణుడిగా కనిపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. “కల్కి 2”లో ఆ కర్ణుడి కథ కాస్త ఎక్కువగానే ఉంటుంది, దాంతో కర్ణుడిగా ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కూడా గట్టిగానే ఉంటుంది. ప్రభాస్ ను “ఆదిపురుష్”లో రాముడిగా సరిగా చూపించలేదు అనే బాధలో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఈ కర్ణుడి పాత్ర మంచి ఊరట ఇవ్వనుంది. ఇక ఇవాళ ఎనౌన్స్ అయిన “గాడ్ ఆఫ్ వార్”లో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం “డ్రాగన్” కోసం చాలా సన్నబడి స్లీక్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్.. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుకాబడే “గాడ్ ఆఫ్ వార్” కోసం మళ్లీ కాస్త బాడీ పెంచనున్నాడు. లాంగ్ హెయిర్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అలాంటి లుక్ లో ఎన్టీఆర్ ను చూడడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇలా మన తెలుగు హీరోలందరూ దేవుళ్లుగా, పురాణ పురుషులుగా మారిపోయి తమ ఇమేజ్ ను ఖండాంతరాలు వ్యాపింపజేస్తుండడం అనేది గర్వించాల్సిన విషయం.
త్వరలో మరింత మంది తెలుగు హీరోలు ఇలా దేవుడి పాత్రల్లో కనిపించే అవకాశం లేకపోలేదు. రానున్న కాలంలో కృష్ణుడిగా, ఈశ్వరుడిగా, విష్ణువుగా బోలెడంత మంది హీరోలు వెండితెరపై కనిపించే సమయం దగ్గరలోనే ఉంది. మరి మన తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారా? అలాగే.. ఈ మైథాలజీ జోనర్ మరీ బోర్ కొట్టించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన దర్శకనిర్మాతలు మరియు కథానాయకుల మీద ఉంది. లేదంటే.. ఇది ఒక రొటీన్ ట్రెండ్ అయిపోయి ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశం కూడా ఉంది.




