
ఆనాడు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించినట్లే వైసీపి అధినేత జగన్ వాలంటీర్ల వ్యవస్థను సృష్టించారు. రాష్ట్రంలో కార్మిక చట్టాల ప్రకారం చూసినా వాలంటీర్లకు కనీస నెలకు రూ.12,000 కనీస వేతనం చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం వాలంటీర్లకు కేవలం నెలకు రూ.5,000 నామ మాత్రపు జీతాలు చెల్లిస్తూ వారి చేత ఐదేళ్ళు చాకిరీ చేయించుకుంది.
వాలంటీర్లను వైసీపి కోసం వాడుకోవాలనుకున్న జగన్ ప్రభుత్వం, ఈ వ్యవస్థకు చట్టబద్దత కూడా కల్పించలేదు. కల్పించి ఉండి ఉంటే వారికీ సచివాలయ సిబ్బందిలా ఉద్యోగ భద్రత ఉండేది. వారికి లేని చట్టబద్దత సచివాలయ సిబ్బందికి ఉంది కనుక ఈసీ వారిచేత పింఛన్ల చెల్లింపులు చేయిస్తోందనే విషయం వాలంటీర్లు గుర్తిస్తే, తాము జగన్ ప్రభుత్వం చేతిలో ఎంతగా మోసపోయామో అర్దమవుతుంది.
నెలకు కేవలం రూ.5,000 జీతం కోసం పనిచేస్తూ తమ జీవితంలో 5 ఏళ్ళ కాలాన్ని కూడా కోల్పోయామని వాలంటీర్లు ఈపాటికి గ్రహించే ఉంటారు. అదే… వేరే ఏ ఉద్యోగంలోనో చేరినా నెలకు 10-15 వేలు సులువుగా సంపాదించుకోగలిగేవారు. చదువులపై ఆసక్తి ఉన్నవారు చదువుకొని జీవితంలో రాణించగలిగేవారు. కానీ వారికి ఆ అవకాశం లేకుండా చేసింది ఈ వాలంటీర్ ఉద్యోగాలే కదా?
వారు ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. కనుక అందరూ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి తమ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని వైసీపి నేతల ఒత్తిళ్ళు చేస్తున్నారు. కుప్పం వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్ ప్రలోభాలు లేదా ఒత్తిళ్ళకు తలొగ్గి 350 మంది వాలంటీర్లు ఒకేసారి రాజీనామాలు చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.
కుప్పంలో ఆయన చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నారు కనుక గెలిచే అవకాశాలు చాలా తక్కువని వేరే చెప్పక్కరలేదు. రేపు ఆయన ఎన్నికలలో ఓడిపోతే ఆయన కోసం రాజీనామాలు చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? ఒకవేళ ఆయన గెలిచినా వారందరినీ మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంటారనే గ్యారెంటీ ఏమిటి?రేపు అనేకమంది కొత్తవారు కూడా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు కదా?
అయితే ఈ సమస్య ఒక్క కుప్పం నియోజకవర్గానికో లేదా కొంతమంది వాలంటీర్లకో పరిమితమైంది కాదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో వాలంటీర్లు రేపు ఇదే సమస్య ఎదుర్కోబోతున్నారు.
అంటే కుటుంబాన్ని పోషించుకునే అంత జీతం ఇవ్వడం లేదు. ఉద్యోగాలకు భద్రత లేదు. రాజీనామా చేయమన్నప్పుడు చేసేయాల్సిందే. చేసినా భవిష్యత్‌కు గ్యారెంటీ ఉండదు! ప్రపంచంలో ఇటువంటి విచిత్రమైన ఉద్యోగం మరేదైనా ఉంటుందా?
రాజకీయ పార్టీలలో పెద్దపెద్ద నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలే తమ భవిష్యత్ వెతుక్కొంటూ పార్టీలు మారుతూ టికెట్స్, పదవులు సంపాదించుకుంటున్నప్పుడు, నెలకు కేవలం రూ.5000 జీతంతో పనిచేసే వాలంటీర్లు తమ దారి తాము చూసుకోవడంలో తప్పేమిటి?
కనుక వాలంటీర్లు వైసీపి గురించి కాకుండా తమ జీవితాలు, తమ కుటుంబాల గురించి ఆలోచించుకొని పనికి తగ్గ ఆదాయం, నిలకడగల ఉద్యోగాలు చూసుకోవడం చాలా మంచిది. అయినా అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు ఆడుకునే రాజకీయ చదరంగంలో వాలంటీర్లు పావులుగా మిగిలిపోవడం అవసరమా? ఆలోచించుకుంటే మంచిది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…