సినీ ఇండస్ట్రీ – పొలిటికల్ ఇండస్ట్రీ ఈ రెండు రంగాలలో ప్రశంసలు ఏస్థాయిలో వస్తాయో అదే విధంగా విమర్శలు అంతకు మించిన స్థాయిలో ఎదురవుతాయి. అయితే సినీ పరిశ్రమ విషయానికొస్తే ఒక సినిమా పూజా కార్యక్రమాల నుంచి ఆ మూవీ రిలీజ్ వరకు ప్రతి అంశం కూడా ప్రచార సాధనమే అవుతుంది.
అయితే అవి కొన్ని సార్లు మూవీకి అనుకూలంగా మారితే మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి మూవీ విడుదల తరువాత వచ్చే రివ్యూ ల వరకు ప్రతి ఒక్కటి సినిమా ఫలితాన్ని నిర్దారిస్తూనే ఉంటాయి. అయితే అవి మూవీ కి ప్లస్ అయితే అందులో ఎటువంటి వివాదాలు ఉండవు, కానీ మూవీ రిజల్ట్ నెగటివ్ గా ఉంటే మాత్రం వివాదాలు కామన్.
అయితే ఇప్పుడా వినోదాన్ని అందించే సినీ పరిశ్రమను కూడా ప్రాంతీయవాదంలోకి తీసుకెళుతున్నారు కొంతమంది ప్రాంతీయవాదులు. మొన్న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన యాష్ టాక్సిక్ చిత్రం విడుదలైన తరువాత యూనానిమస్ గా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అటు మూవీ రివ్యూవర్స్ నుంచి ఇటు సామాన్య ప్రేక్షకుడి వరకు అందరు సినిమా తమకు నచ్చలేదు అంటూ తమ అభిపాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అయితే టాక్సిక్ సినిమా పై వెలువడిన ఈ నెగటివిటీ ని ప్రాంతాలతో ముడిపెట్టి ఎదురుదాడికి దిగారు. యష్ శాండిల్ వుడ్ లో ఒక అగ్రనటుడు. టాక్సిక్ కన్నడ మూవీ కావడంతోనే కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ మూవీ పై తమ హీరో పై ట్రోల్స్ చేస్తూ సినిమాకి నెగటివ్ రివ్యూ ఇస్తున్నారంటూ కొంతమంది కన్నడికులు సోషల్ మీడియా వేదికగా సినీ పరిశ్రమకు ప్రాంతీయవాదాన్ని జత చేసారు.
అయితే టాక్సిక్ పై నెగటివ్ రివ్యూ ఇస్తే ఇలా ప్రాంతీయవాదాన్ని రెచ్చకొడుతున్న సోకాల్డ్ వ్యక్తులు అదే యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ -1, 2 సినిమాలను ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చేసిన విషయాన్ని సైడ్ చేస్తున్నారు, అలాగే రిషబ్ శెట్టి కాంతారా – 1, 2 చిత్రాలకు కూడా టాలీవుడ్ ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ మంచి రివ్యూ ఇచ్చి ఆ చిత్రాలకు బ్రహ్మ రథం పట్టారు అనేది గుర్తించాలి.
కానీ వాటన్నిటిని పక్కన పెట్టి తమకు నచ్చని సినిమాను తమకు నచ్చలేదు అని చెప్పే పూర్తి స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా ఇలా సినిమాకు నెగటివ్ టాక్ రాగానే తమ సినిమా పై కుట్ర అంటూ కట్టుకథలు అల్లడం ఏమేరకు సమంజసం.? సరిగ్గా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నటించిన ది పారడైజ్ మూవీ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇదే రకమైన రచ్చ నడుస్తుంది.
ఈ నెల 23 న ప్రీమియర్ షో లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ది పారడైజ్ మూవీ కూడా రిలీజ్ కు ముందు నుంచి ప్రేక్షులలో మంచి అంచనాలను సృష్టించింది. అయితే రిలీజ్ తరువాత ఆ అంచనాలు తలకిందులు అయ్యాయంటూ అటు మూవీ రివ్యూవర్స్ నుంచి ఇటు సామాన్య ప్రేక్షకుడి వరకు తమ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
అయితే మూవీ పై నెగటివ్ టాక్ రావడంతో కొంతమంది దీన్ని కూడా ఆంధ్ర – తెలంగాణ అనే వివాదంగా సృష్టించేందుకు సోషల్ మీడియాలను వేదికలుగా ఎంచుకుంటూ అర్ధం పర్ధం లేని యుద్దాలు చేస్తున్నారు. పారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెలంగాణ వాసి అని, ఒక తెలంగాణ వ్యక్తి సినిమా తీస్తే దాని పై నెగటివ్ ప్రచారం చేయడానికి ఆంధ్రా వాళ్ళు ముందుంటారని,
ఇంకెన్నాళ్ళు తెలంగాణ భాష మీద, తెలంగాణ డైరెక్టర్ల మీద మీ నెగటివిటి అంటూ రాజకీయ నాయకుల లెక్క తెలంగాణ పేరు మీద తమ వాదన వినిపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. సినిమ పై నెగటివ్ రివ్యూ రాగానే ఇలా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రా అంటూ సోషల్ మీడియా వేదిక గా జరుగుతున్న రచ్చ ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అనేది గ్రహించాలి.
సినిమాని సినిమాలనే చూడాలి, నచ్చితే అది ఏ భాష చిత్రమైన ఇండియన్ సినిమా గా ప్రేక్షకుల ప్రశంసలు పొందుతుంది. అందుకు బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతారా…వంటి సినిమా ఫలితాలు, ఆ సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ప్రత్యక్ష ఉదాహరణలు.
అలాగే మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుడిని మెప్పించలేక పోతే కూడా అంతే రకమైన నెగటివిటీ ఎదురవుతుంది. అందుకు గేమ్ ఛేంజర్, వార్ -2, టాక్సిక్, తాజగా ది పారడైజ్….రెంటిని సమానంగా స్వీకరించలేని వారే ఇలా ప్రాంతీయవాదాన్ని తెరమీదకు తెచ్చి లేనిపోని సింపతీ పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.





