విభిన్నమైన సబ్జెక్టులు, విలక్షణమైన నటనతో ఈ మధ్య కాలంలో అందరినీ ఆకట్టుకుంటున్న నటుడు సత్యదేవ్. ఆయన తాజా చిత్రం తిమ్మరుసు… అక్టోబర్ లో లాక్ డౌన్ పూర్తయ్యాకా మొదలుకాబడిన ఈ సినిమా అప్పుడే ముగింపుకు చేరుకుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటి క్రితం విడుదలయ్యింది.
ఈ చిత్రంలో సత్యదేవ్ ఒక నిజాయితీ గల న్యాయవాదిగా కనిపిస్తాడు. కేసు గెలిచామా ఓడామా అనేది కాదు డబ్బు సంపాదించామా లేదా అనేది ప్రధానం అని చుట్టూ ఉన్న వారు అంటుంటే నాకు మాత్రం న్యాయాన్ని గెలిపించడమే ముఖ్యం అంటాడాయన. తాను నమ్మిన న్యాయం కోసం తుపాకీ పట్టడానికైనా వెనుకాడని పాత్ర తిమ్మరుసు.
ట్రైలర్ ని బట్టి సత్యదేవ్ లాయర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు అని చెప్పవచ్చు. సినిమా మేకింగ్ క్వాలిటీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ఒక ఆసక్తికరమైన కోర్టు రూమ్ డ్రామా గా ఉన్న ఈ సినిమాలో మంచి మలుపులు ఉంటే మంచి సినిమా అవుతుంది. తెలుగులో మంచి కోర్టు రూమ్ డ్రామాలు వచ్చి చాలా కాలం అయ్యింది కూడా.
నిఖిల్ సిద్దార్థ్ తో కిర్రాక్ పార్టీ వంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ శరణ్ కొప్పిసెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్‌కోనేరు-సృజన్ యరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా సత్యదేవ్ ..గుర్తుందా సీతాకాలం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.





