Telugu

పవన్ – చిరు అభిమానులకు మరపురాని రోజు!

అవును… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడడానికి పునాది పడిన రోజు ఇది. అప్పటివరకు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే ప్రేక్షకులకు పరిచయం అయిన పవన్ కళ్యాణ్… తానేంటో నిరూపించుకున్న రోజు జూలై 24వ తేదీ. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ‘తొలిప్రేమ’ సినిమా విడుదలై, ఒక చరిత్ర లిఖించబడినది ఈ రోజే.

అప్పటివరకు మూడు సినిమాలలో నటించిన పవన్ కు పెద్దగా గుర్తింపు లభించింది అంటూ ఏమీ లేదు. మొదటి సినిమా ద్వారా ఫ్లాప్, రెండవ సినిమాతో యావరేజ్, మూడవ సినిమాతో హిట్ స్థాయిని అందుకున్నప్పటికీ, పవన్ అంటే చిరు సోదరుడు కాబట్టి, సినీ ప్రేక్షకులు ‘తొలిప్రేమ’ సినిమాకు వెళ్ళిన రోజులవి. అయితే ఇదంతా సినిమా విడుదలకు ముందు వరకు మాత్రమే… రిలీజ్ తర్వాత పవన్ అంటే ఒక మేనియా, పవన్ అంటే యూత్ ఐకాన్, పవన్ అంటే ఒక ప్రభంజనం..!

ADVERTISEMENT

అంతలా ప్రేక్షకులను తనదైన శైలిలో కట్టిపడేసాడు పవన్. అప్పటివరకు హీరో అంటే సంప్రదాయపు పాత్రలు, ఒక బాధ్యతాయుతమైన పాత్రలకే పెట్టింది పేరు. కానీ, ‘తొలిప్రేమ’ తర్వాత హీరో అంటే అల్లరి చిల్లరగా తిరిగే పాత్రలే ఎక్కువగా పుట్టుకొచ్చాయి. అంతలా ఒక ట్రెండ్ ను సృష్టించింది. ఇందులో ప్రధాన క్రెడిట్ దర్శకుడు కరుణాకరన్ దే అయినప్పటికీ, అప్పట్లో కరుణాకరన్ అంటే ఎవరికీ తెలియని తమిళ దర్శకుడు కావడంతో… ఆ క్రెడిట్ అంతా పవన్ ఖాతాలోనే పడిపోయింది. అలా ‘తొలిప్రేమ’ అంటే పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్ అంటే ‘తొలిప్రేమ’గా మారిపోయింది.

సంగీతం అందించిన దేవా పాటలు యువతరాన్ని సమ్మోహితులను చేసాయి. రెండేళ్ళ క్రితం ‘తొలిప్రేమ’ సినిమాలో ఓ పాటను రీమిక్స్ చేసినా, అది కూడా యూత్ ఒక ఊపు ఊపిందంటే… ఆ పాటలు ఎంతగా ప్రభావితం చూపాయో అర్ధం చేసుకోవచ్చు. రికీ మార్టిన్ ఆల్బమ్ ని తెలుగులోకి దించాడన్న మాట వాస్తవమే అయినప్పటికీ, పాటల చిత్రీకరణ… పవన్ హంగామాతో కాపీ అన్న మాటను మరిచిపోయి మరీ, ‘తొలిప్రేమ’ పాటలకు సంగీత ప్రియులు, ప్రేక్షకులు ఊగిపోయారు. అలా పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన “తొలిప్రేమ” సినిమాకు 18 ఏళ్ళు పురస్కరించుకుని, అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ఇక, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కూడా మరపురాని రోజుగా మారింది జూలై 24వ తేదీ. సీమ డైలాగ్స్ కొట్టాలన్నా, మీసం మేలేయలన్నా… ఒక్క నందమూరి నటసింహం బాలకృష్ణ ఒక్కడే అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్న రోజులవి. ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం’ ఇలా వరుసగా ఫ్యాక్షన్ సినిమాలను చేస్తూ ఓ ట్రెండ్ సృష్టించిన బాలయ్య రికార్డులను బీటలు వారేలా చేసిన సినిమా మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర.’

‘రాననుకున్నావా… రాలేననుకున్నావా…’ అంటూ ఫ్యాక్షన్ సినిమాలలో తన సత్తాను చూపించిన ‘ఇంద్ర’కు అభిమానులు బ్రహ్మరధం పట్టారు. ‘ఇంద్ర’ సినిమా విడుదలకు ముందు వరకు… ‘ఫ్యాక్షన్ సినిమాలకు మెగాస్టార్ తేలిపోతారు’ అని విమర్శలు చేసిన కలాలే… ‘ఫ్యాక్షన్ లోనూ సందేశాన్ని ఇవ్వడం’ మెగాస్టార్ కే సాధ్యమైంది అంటూ ప్రశంసలు కురిపించారు. సీమ డైలాగ్స్ ను పలకలేరంటూ చిరుపై వచ్చిన విమర్శలకు ధీటుగా, పదునైన డైలాగ్స్ తో వెండితెరపై విరుచుకుపడ్డారు మెగాస్టార్.

అలా టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన ‘ఇంద్ర’ సినిమా 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అభిమానులకు ఎంత ఊపు ఇచ్చిందంటే… శతదినోత్సవం పేరుతో విజయవాడ సమీపాన గల గొల్లపూడిలో నిర్వహించినటువంటి వేడుకలో ఇసుక రాలనంత అభిమాన గణం తరలివచ్చారు. అప్పట్లోనే దాదాపు అయిదారు లక్షల మంది వచ్చారంటూ ప్రచారం జరిగింది. ఒక రకంగా… ఈ అభిమాన గణం చూసిన తర్వాతే… మెగాస్టార్ లో రాజకీయ బీజం పడింది అంటారు సినీ జనాలు. అలా రెండు రకాలుగా కూడా ‘ఇంద్ర’ సినిమా చిరంజీవి కెరీర్లో మధురాతిమధురం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

FaFa’s DTTT Trailer Mixes Fantasy, Mystery And Comedy

The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…

15 minutes ago

SCOOP: Fauzi’s New Date to Repeat Dil Raju-Mythri War?

Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…

1 hour ago