ఒకప్పుడు సినిమాలు కొంచెం అటుఇటు ఉన్నా హీరో ఇమేజ్ మీద ఆడేవి. అందుకే ఓ ఇరవై ఏళ్ళు వెనక్కు వెళ్తే ఫ్లాప్ మూవీస్ సైతం హండ్రెడ్ డేస్ ఆడిన దాఖలాలు కనిపిస్తాయి. ఇప్పుడు రోజులు మారాయి. కంటెంట్ ఏ మాత్రం తేడా ఉన్నా జనం నిర్మొహమాటంగా తిప్పి కొడుతున్నారు. కానీ కొందరు దర్శక నిర్మాతలు మాత్రం కేవలం బిజినెస్ లెక్కలను ఆధారంగా చేసుకుని హీరో ఇమేజ్ తో కోట్లకు కోట్లు టర్నోవర్ చేసుకోవచ్చనేలా తీస్తున్నారు. తాజా ఉదాహరణ తెగింపు. టైటిల్ పవర్ ఫుల్ ఉంది కదా బొమ్మ కూడా అదే రేంజ్ లో ఉంటుందనే నమ్మకంతో జనాలు థియేటర్లకు వెళ్లారు. వరస్ట్ అని కాదు బాలేదని కాదు కానీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందో చూద్దాం
బ్యాంక్ దొంగతనాల నేపధ్యం ప్రేక్షకులకు కొత్త కాదు. వర్మ క్షణ క్షణంతో మొదలుపెట్టి లెక్కబెట్టుకుంటూ పోతే ఆయాసం వస్తుంది. ఆయాచితంగా వచ్చే డబ్బుని కొట్టేయడమనే పాయింట్ నిజంగానే థ్రిల్ ఇచ్చేదే. కానీ దాన్ని సరైన రీతిలో వాడినప్పుడే ఆడియన్స్ చప్పట్లు కొడతారు. కాసులు కురిపిస్తారు. ఎక్కడో కొరియన్ లో తీసిన మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ని భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పగా ఎలా ఆదరించారు. కారణం ఏంటి. ట్విస్టులకు మతి పోతుంది. ఊహించని సంఘటనలతో దర్శకుడు మైండ్ బ్లాంక్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసే లేడీ ఆఫీసర్ నే బుట్టలో పడేసి గ్యాంగ్ లో చేర్చుకునే ముఠానాయకుడి తెలివికి షాక్ తింటాం
అందుకే అందులో హీరో లేకపోయినా విలనే కథానాయకుడనిపిస్తాడు. తెగింపు దర్శకుడు వినోత్ దీన్నే తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్చి తీద్దామనుకున్నాడు. అజిత్ ఉన్నాడు కదా లాజిక్స్ ఎందుకు అవసరం లేదనిపించింది. బ్యాంక్ లు అమ్మే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశంలో కోట్లాది బాధితులు ఉన్నారు కదా ఇంకేం భేషుగ్గా ఎగబడి చూస్తారనుకున్నాడు. అందుకే కాబోలు కథను లైట్ తీసుకుని యాక్షన్ ఎపిసోడ్లు, గన్ ఫైర్ లు, ఫైటింగులు గట్రా పెట్టేసి తర్కాన్ని గాలికి వదిలేసి తెగించి చూడమని తెగింపుని కానుకగా ఇచ్చాడు. ఎంత అజిత్ అభిమానులు రొటీన్ కంటెంట్ ని ఆదరిస్తున్నారని మరీ స్క్రీన్ ప్లేని లైట్ తీసుకుంటే ఎలా
అజిత్ చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. ఫోటోలో వీడియోలో చూసుకుంటే సరిపోతుంది.కానీ ఓ రెండు వందలు పెట్టి థియేటర్ కు రావాలంటే ఆ కటవుట్ ఒకటే సరిపోదు. కథాకమామీషు బోలెడు కావాలి. అసలే పాటలు లేవు. కామెడీని పక్కన పెట్టారు. నో హీరోయిన్. సీరియస్ నెస్ లోనే ఎంటర్ టైన్మెంట్ వెతుక్కోమన్నారు. బలవంతపు ఫ్లాష్ బ్యాక్స్ లో ఎమోషన్ ఫీలవ్వమన్నారు. కట్ చేస్తే ఫ్యాన్స్ ఎలా ఉన్నా సూపరంటారేమో కానీ ఇతర భాషల్లో డబ్బింగ్ చూసే జనాలు మాత్రం అబ్బే ఇలాంటివి ఎన్ని చూడలేదని నిట్టూరుస్తారు. టైటిల్ తెగింపు అని పెట్టారు కానీ నిజంగా తెగించి కొత్తగా ఏదైనా చూపించే ప్రయత్నం చేసి ఉంటే దర్శకుడు వినోత్ కి మూడో అవకాశం ఇచ్చిన తలా ఉద్దేశం నెరవేరేది



