
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నెయ్యి వాసన గుప్పుమంటోంది. ఆ వాసన ఢిల్లీ వరకు వ్యాపించి, జాతీయ న్యూస్ ఛానల్స్‌లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. మంచో చెడో మన ఈ ఘనకార్యం గురించి దేశమంతా చెప్పుకుంటోంది. అయితే హిందువుల మనోభావాలతో ముడిపడున్న ఈ సున్నితమైన అంశంపై అధికార, ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కారణం రెండూ ఈ వ్యవహారంలో ‘లాక్’ అయిపోవడమే.
తిరుమల ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని పామాయిల్, కెమికల్స్ ఉపయోగించి ఆ కల్తీ నెయ్యిని తయారు చేశారని సిట్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయితే గత ఏడాది ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటపెట్టినప్పుడు, దానిలో ‘జంతువుల కొవ్వు’ కలిసిందని సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మాటనే వైసీపీ పట్టుకొని రచ్చ రచ్చ చేస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు తమపై బురద జల్లేందుకు పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో కొవ్వు కలిపిన నేతిని ఉపయోగించామంటూ తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ & కో అవసరానికి మించి చాలా బిగ్గరగానే వాదిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో స్పష్టంగా ఉంది కనుక. వైవీ సుబ్బారెడ్డి వంటి వైసీపీ నేతలు సైతం కల్తీ నెయ్యి వాడామని ఒప్పుకుంటున్నారు.
వైసీపీ అధినేత జగన్‌తో సహా టిటిడీలో చక్రం తిప్పిన పలువురు వైసీపీ నేతలు అన్యమతస్తులే. కనుక ఈ నేరం చేసినట్లు ఒప్పుకుంటే సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నట్లు జగన్ & కో తిరుమల పవిత్రతని దెబ్బ తీయడానికి కుట్ర చేశామని ఒప్పుకున్నట్లే అవుతుంది. అప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీలాగే, వైసీపీ కూడా సమూలంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
అందుకే జగన్ & కో ఎదురుదాడి చాలా ‘హైపిచ్’లో చేస్తున్నారనుకోవచ్చు. అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య, కోడికత్తి వరకు ప్రతీ నేరాన్ని తమ ప్రత్యర్ధులకే ఆపాదించి రాజకీయ లబ్ది పొందడం వైసీపీకి అలవాటే. కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా సరిగ్గా అలాగే చేస్తున్నారు. ఈ వ్యవహారం బయటపెట్టిన సిఎం చంద్రబాబు నాయుడునే ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దానిలో భాగంగానే సర్వశక్తులు కూడగట్టుకొని చాలా భీకరంగా ఎదురుదాడి చేస్తున్నారు. తిరుమల స్వామివారితో, భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నందుకు సిఎం చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
అయితే “సిట్ నివేదికలో అది పాలతో చేసిన నెయ్యే కాదని, కెమికల్స్‌తో చేసిన కల్తీ నెయ్యి అని స్పష్టంగా పేర్కొన్నప్పుడు సిగ్గుతో తలదించుకోవలసింది పోయి, మాపైనే ఎదురుదాడి చేస్తారా?” అంటూ సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ & కో బ్రహ్మోస్ క్షిపణితో దాడి చేస్తుంటే, కూటమి ప్రభుత్వం తీరు డ్రోన్లతో దానిని ఎదుర్కొంటున్నట్లు ఉంది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సిఎం చంద్రబాబు నాయుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు తప్ప తాము అధికారంలోకి వచ్చాక కల్తీ నెయ్యి వాడటం లేదు.
కానీ వైసీపీ హయంలో ఉద్దేశ్యపూర్వకంగానే కల్తీ నెయ్యి వినియోగించారు. కనుక ఈ నేరం చేసింది వైసీపీ ప్రభుత్వమే. కనుక సిట్ నిరూపించగలిగితే దానికి వైసీపీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని నిరూపించగలిగితే అందుకు వైసీపీ ఇంకా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కానీ పొరపాటునో లేదా వైసీపీ ఆరోపిస్తున్నట్లు రాజకీయ ఉద్దేశ్యంతోనో సిఎం చంద్రబాబు నాయుడు నెయ్యిలో కొవ్వు కలిసిందని ఉంటే అందుకు క్షమాపణలు చెప్పుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కనుక ఆలోచించుకోవాల్సింది సిఎం చంద్రబాబు నాయుడే.
ఏది ఏమైనప్పటికీ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండు పార్టీలు లాక్ అయిపోయాయి. కనుక ఇప్పుడు ఎవరూ వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. తగ్గితే ఈ తప్పుకి వారే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కానీ ఇరు వర్గాలు గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఇలాంటి సున్నితమైన అంశంపై భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా ఇలాగే రాజకీయాలు చేసుకుంటూ పోతే రెండూ కూడా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అదెలాగో కాలమే చెపుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…