తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ప్రభావం గట్టిగానే పడింది. సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిపోల నుంచి బస్సులను బయటకు తీసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేసినా అవి సరిపోవడం లేదు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 29 డిపోలు 3,567 బసులు ఉండగా వీటిలో కేవలం 150 నుంచి 200 బస్సులు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి.
సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని కార్మికులు ఇక ఆర్టీసీ ఉద్యోగులు కారని, భవిష్యత్తులో కూడా వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే కార్మికులు మాత్రం ఈ బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి.
సంస్థను ఆంధ్రప్రదేశ్ మాదిరి ప్రభుత్వంలో విలీనం చెయ్యాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ తలపోటు కేసీఆర్ స్వయంగా తెచ్చి పెట్టుకున్నదే. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఉండగా కేసీఆర్ పోటాపోటీగా ఫిట్మెంట్ ప్రకటించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ప్రకటిస్తే ప్రతిగా కేసీఆర్ 44% ఫిట్మెంట్ ప్రకటించారు.
ఇప్పుడు ఏపీ పద్ధతే మాకు కావాలని ఇక్కడి కార్మికులు అంటున్నారు. అప్పట్లోనే ఏపీకి మనకు సంబంధం ఏమిటి అని ఉంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు. ఈ సమ్మె సరిగ్గా హుజుర్ నగర్ ఉపఎన్నిక ముందు జరగడం అధికార పార్టీకి ఇబ్బంది కలిగించేదే.





