నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మళ్ళీ ప్రారంభం అయిన అన్‌స్టాపబుల్ సీజన్-2 టాక్ షోలో మొట్టమొదట తన బావ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, తన అల్లుడు నారా లోకేష్‌తోనే మొదలుపెట్టడం విశేషం. ఈరోజు అన్‌స్టాపబుల్ సీజన్-2 ప్రమో విడుదలైంది. దానిలో ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు నాయుడుని బాలయ్య సరదాగా కవ్విస్తూ చిలిపి ప్రశ్నలు అడుగుతుంటే ఆయన కూడా అంతే చమత్కారంగా జవాబులు ఇస్తూ షోని రక్తి కట్టించడం విశేషం. బాలయ్య, చంద్రబాబు నాయుడు ఇద్దరూ పోటాపోటీగా ఒకరినొకరు కవ్వించుకొంటూ మాద్యమద్యలో చాలా గంభీరమైన అంశాలు ప్రస్తావిస్తూ షోని ఆధ్యంతం రక్తి కట్టించినట్లు ప్రమో చూస్తే అర్దం అవుతోంది.
ముఖ్యంగా వారి సంభాషణలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా రావడం విశేషం. బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని చంద్రబాబు నాయుడుని ప్రశ్నించగా “నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాగా కలిసి తిరిగేవాళ్ళం,” అంటూ సమాధానం చెప్పడం విశేషం. అలాగే నారా లోకేష్ విదేశంలో స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో దిగిన ఫోటోను స్క్రీన్ మీద చూపి, “దీని గురించి ఏమంటావు అల్లుడు?” అని నారా లోకేష్‌ని ప్రశ్నించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ తర్వాత బాలయ్యే కలుగజేసుకొని “అసెంబ్లీ వరకు వెళ్లిందీ ఈ ఫోటో తెలుసుగా?” అంటూ మీరమంటారు అంటూ చంద్రబాబు నాయుడుని ప్రశ్నించగా “మామ అల్లుళ్ళకు లేని సమస్య నాకెందుకు? అంటూ చాలా చలోక్తిగా సమాధానం చెప్పడంతో ప్రేక్షకులు అందరూ హాయిగా నవ్వుకొన్నారు.
“రాజకీయాలు కాక మరేమైనా చేశారా?” అంటూ బాలయ్య కొంటె ప్రశ్నకు చంద్రబాబు నాయుడు కూడా అంతే కొంటెగా సమాధానం చెపుతూ, “నువ్వు సినిమాలలో చేశావు నేను కాలేజీలో చదువుకొంటున్నప్పుడు బయట చాలానే చేశాను,” అంటూ తన కొంటెపనులను వివరించడంతో అందరూ హాయిగా నవ్వుకొన్నారు.
అందరి ముందు మా చెల్లి (భువనేశ్వరి)కి ఫోన్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పాలని బాలయ్య సవాల్ విసరడంతో చంద్రబాబు నాయుడు నవ్వుకొంటూ భార్యకి ఫోన్ “హలో భూవీ… ఇక్కడ మీ బాలకృష్ణ చేతిలో ఇరుక్కుపోయానే…”అంటూ చెప్పడం చూసి మళ్ళీ అందరూ పకపక నవ్వుకొన్నారు.
అలాగే ఈ షోలో చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలిగించే కొన్ని సీరియస్ అంశాలను కూడా బాలయ్య ప్రస్తావించినట్లు ప్రమో చూస్తే అర్దమవుతోంది. ఈ షోలో వారిరువురూ కలిసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద పంచులు వేయబోతున్నట్లు ప్రమో చూస్తే అనుమానం కలుగుతోంది. కనుక బాలయ్య, చంద్రబాబు నాయుడు కలిసి ఈ షోని ఇంకా ఎంత రక్తి కట్టించారో తెలుసుకోవాలంటే శుక్రవారం రాత్రి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోయే ఈ షోను చూడాల్సిందే.



