
విజయవాడ మేయర్ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవి) నేడు ప్రెస్‌మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊహించినట్లే అయన సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ మాజీ సిఎం జగన్ ప్రస్తావన చేయకుండా మాట్లాడారు. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలు బహిరంగంగా మద్దతు ఇస్తుంటే, బహుశః వైసీపీ లోపాయికారిగా మద్దతు ఇస్తుండటమే కారణం కావచ్చు.
ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన చాలా విషయాలు మాట్లాడారు. విజయవాడ ప్రజలు కులాలు, పార్టీల గుర్తులు చూసి గుడ్డిగా ఓట్లు వేసేందుకు అలవాటు పడిపోయారని ఆక్షేపించారు. అయితే అదే నోటితో నగరానికి మంచి చేసేందుకు వచ్చిన తనకు ఓట్లు వేసి గెలిపించాలని సవినయంగా మనవి చేసుకున్నారు.
ఒక్కో కార్పొరేటర్ టికెట్ కోసం రూ.10-75 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికలలో గెలవాలంటే రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఏబీవీ కుండబద్దలు కొట్టారు.
మేయర్ పదవికైతే ఇంకా చాలా ఖర్చవుతుందని అన్నారు. కానీ తను ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, ఎవరికీ ఒక్క రూపాయి పంచకుండా పోటీ చేసి గెలుస్తానని ఏబీవి శపథం చేశారు.
తనను మేయర్‌గా ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మరీ విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని ఏబీవి అన్నారు.
అయితే విజయవాడ ప్రజలు గుడ్డిగా ఓట్లు వేయడానికి అలవాటు పడిపోయారంటూ వారి విజ్ఞతపై సందేహం వ్యక్తం చేసినప్పుడు, మళ్ళీ తన మొహం చూసి ఓట్లు వేయమని కోరడం చిత్రంగానే ఉంది కదా?
ఓ కార్పొరేటర్ టికెట్, పదవి కోసం అంత సొమ్ము అవసరమైనప్పుడు మేయర్ పదవికి ఇంకా చాలా ఖర్చవుతుందని ఆయనే స్వయంగా చెబుతున్నారు. ఈరోజుల్లో వీధి చివర ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయాలన్నా కొన్ని వేలు ఖర్చవుతుంది. కానీ తను ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ఖర్చు చేయబోనని అంటున్నారు. ఆయన మాటలు నమ్మశక్యంగా ఉన్నాయా?
అయన ఇంత బహిరంగంగా సిఎం చంద్రబాబు నాయుడుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు, మేయర్‌గా ఎన్నికైతే ఏవిధంగా నిధులు రాబట్టగలరు?
ఒకవేళ ఆయన మేయర్‌గా ఎన్నికోబడినా, కౌన్సిలర్లు అందరూ కూటమి పార్టీలు, వైసీపీకి చెందినవారే ఉంటారు. వారి సహాయ సహకారాలు ఏవిధంగా పొందగలరు? పొందలేకపోతే ఆయన ఒంటరిగా ఏం చేయగలరు? వంటి అనేక ప్రశ్నలకు అయన సంతృప్తికరమైన జవాబులు చెప్పగలిగితే, విజయవాడ ప్రజలు ఆయన గురించి తప్పక ఆలోచిస్తారు.
Today happens to be the final day of the Dasara holiday season and it is…
Sai Dharam Tej’s wedding is back in the news, and this time, reports are even…