విరాట్ విధ్వంశం 2.0….

Virat Kohli 139: The Chase Master Eyes 2027 World Cup

భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇటీవల జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2027 వన్డే ప్రపంచకప్ తనకు చివరిదై ఉండొచ్చని చెప్పారు. ఈ మాటలు కోహ్లీ అభిమానులను ఒక్కసారిగా భావోద్వేగానికి గురచేసాయి. అలాగే వరల్డ్ కప్ అనంతరం కోహ్లీ ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడతాడో అనే ఆవేదన ఆయన అభిమానుల నుంచి వ్యక్తమయింది.

అయితే అదే సమయంలో కోహ్లీ తన బ్యాట్‌తో మాత్రం మరో కథ రాసుకొస్తున్నాడు. ఇప్పటికీ ఎందుకు తనను ‘చేజ్ మాస్టర్’ మరియు ‘వైట్ బాల్ గ్రేట్’ అంటారో కోహ్లీ అనేది నిన్న కేరళం లోని తిరువనంతపురం లో భారత్ – వెస్ట్ ఇండీస్ మధ్య జరిగిన వన్ డే మ్యాచ్ తో మరోసారి నిరూపించుకున్నాడు.

ADVERTISEMENT

తాను ఆడిన చివరి11 ఇన్నింగ్స్‌ లలో ఏకంగా 9 సార్లు 50కి పైగా పరుగులు సాధించటమే కాదు, అందులో ఐదు సెంచరీలు ఉండటం అతని అద్భుతమైన స్థిరత్వానికి నిదర్శనం. 37 ఏళ్ల వయసులోనూ అతని బ్యాటింగ్‌లో ఆ ఆకలి మరియు విజయం పట్ల ఉన్న కసి ఏమాత్రం తగ్గలేదు అనేలా బౌలర్ల పై తన బ్యాట్ తో విరుకుపడ్డారు కోహ్లీ.

క్రికెట్‌లో తానూ తన చివరి అధ్యాయం లోకి చేరుకుంటున్నాననే సంకేతాలు ఇచ్చిన వెంటనే కోహ్లీ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 88 బంతుల్లోనే 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 సిక్సర్లు ఉన్నాయి. అందులో కోహ్లీ తన అర్ధ శతకాన్ని, శతకాన్ని కూడా సిక్స్ తో నే పూర్తి చేయడం ఇక్కడ మరో కొసమెరుపు.

ప్రత్యర్థి బౌలర్లపై మొదటి బంతి నుండే ఎదురుదాడికి దిగుతున్న తీరు అభిమానులకు మళ్లీ పాత కోహ్లీని గుర్తు చేసినప్పటికీ, ఇది పాత కోహ్లీ కాదు అంతకు మించి అనేలా ….మరింత దూకుడుతో కొత్త అవతారంలా కనిపిస్తున్నాడు. అప్పటినుండి ఇప్పటివరకు పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించి, చివర్లో మ్యాచ్‌ను ముగించడం కోహ్లీ ప్రత్యేకతగా నిలిచింది.

కానీ, దానికి భిన్నంగా మొదటి బంతి నుంచే బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ దూకుడుగా ఆడుతున్నాడు. పేసర్లను ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి వ్యూహాలను చెదరగొడుతున్నాడు. కోహ్లీ కెరీర్ చివరి దశలో కనిపిస్తున్న ఈ ఎటాకింగ్ వర్షన్ భారత అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. ఇలాంటి ఆటతీరును కొనసాగిస్తే కోహ్లీ తన కెరీర్‌ను అత్యున్నత స్థాయిలో ముగించే అవకాశం ఉంటుంది.

నిన్న విరాట్ బ్యాట్ నుండి వచ్చిన 139* ఇన్నింగ్స్ ఎన్నో రికార్డులను బద్దలుకొట్టి అతన్ని మరోసారి కింగ్ కోహ్లీ గా నిలబెట్టింది. 57 పరుగుల వద్ద విరాట్ తన వన్-డే కెరీర్ లో 15000+ పరుగులు చేసిన 2వ బ్యాటర్ గా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. ఇక, వన్-డే ఫార్మాట్లో ఏకంగా 55 సెంచరీలు నమోదు చేసి ఎవ్వరికి అందనంత ఎత్తుకు చేరాడు విరాట్ కోహ్లీ.

ప్రత్యేకంగా 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అతడికి ఈ ఫామ్ ఎంతో కీలకం. భారత్ తరఫున మరో ప్రపంచకప్ ఆడటమే కాదు, తన కలను నెరవేర్చుకోవాలని కోహ్లీ కోరుకుంటున్నాడు. ఆ ప్రయాణంలో అతని బ్యాట్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని వస్తే అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుంది.

కోహ్లీ ఎప్పుడు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడు అనేది అతని నిర్ణయం. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తే అతను తన బ్యాట్‌కు ఫుల్ స్టాప్ పెట్టే తీరులో లేడనే భావన అభిమానుల్లో ఉంది. టీమిండియా తరఫున సాధ్యమైనంత కాలం కొనసాగుతూ 2027 ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న అతని కల నెరవేరాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఎందుకంటే కోహ్లీ కథ ముగిసే ముందు…అతని బ్యాట్ నుంచి ఇంకా ఎన్నో అధ్యాయాలు రావాల్సి ఉంది!

ADVERTISEMENT
Latest Stories