విశాఖపట్నం కేంద్రంగా ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కీలకమైన వాల్తేరు డివిజన్ లేకుండానే జోన్ ఏర్పాటు చేశారు. దానిని మన వారు ప్రతిఘటించినా పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది. ఇటీవలే జోన్ ఏర్పాటుకు సంబందించిన కీలక డీపీఆర్ రైల్వే బోర్డుకి సమర్పించారు.
జోన్ కార్యకలాపాలకు ముహూర్తం నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1, 2020 నుండి కార్యకలాపాలు ప్రారంభించేలా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. వాల్తేరు జోన్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని దానిని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో కొనసాగించాలి అనుకుంటే మాత్రం ముహూర్తం వాయిదా పడే అవకాశం ఉంది.
అప్పుడు డీపీఆర్ లో మార్పులు చేర్పులు చెయ్యవలసి ఉండడంతో ఏప్రిల్ 1, 2020కు ముహూర్తం మారే అవకాశం ఉంటుంది. ఇటీవలే ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిపోవడంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ వైపు సహేతుకమైన నిర్ణయం తీసుకుంటుందని ఇక్కడ స్థానికులు, రాజకీయపక్షాలు భావిస్తున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం జోన్ ప్రకటించిన నాటి పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్ళాలని, ఇప్పుడు మార్పు చేర్పులు చెయ్యడం వల్ల ఒడిశాలో నష్టపోవడంతో తప్ప ఎటువంటి ఉపయోగం లేదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఉత్తరాంధ్ర ప్రజలకు నిరాశే అన్నట్టు చెప్పాలి.





